అవిశ్వాసం పెట్టండి.. మద్దతు నేను తెస్తా
ప్రతిపక్ష వైసిపి అవిశ్వాస తీర్మానం నోటిస్తు ఇస్తే, పార్లమెంటులో అవసరమైన మద్దతు తాను కూడగడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన సవాల్‌పై స్పందించిన ఆయన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని, మార్చి 4లోగా అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని ప్రతిసవాల్ విసిరారు. జనసేన పార్టీ కేంద్ర పరిపాలన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని సూచించారు. అన్నింటికి సిద్దపడే రాజకీయాల్లోకి వచ్చినని, మాట ఇస్తే వెనక్కి వెళ్లే వ్యక్తిని కాదని అన్నారు.
పార్లమెంటు నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి ఒక్క ఎంపీ సరిపోతారని, ముందు పార్లమెంటు సెక్రటరీకి నోటీసు ఇస్తే, స్పీకర్ అడిగే నాటికి అవసరమైన ఎంపిల మద్దతు తాను కూడగడతానని సృష్టం చేశారు. వీలైతే రేపే ఎంపీలను ఢిల్లీకి పంపాలని, లేదంటే మార్చి 4న అయినా నోటీసు ఇవ్వాలని సూచించారు. మార్చి 5 నుంచి పార్లమెంటు రెండో విడత సమావేశాలు ప్రారంభం అవుతాయని, ఈలోపు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇస్తే, సమావేశాలు ప్రారంభం కాగానే అవిశ్వాస తీర్మాణంపై చర్చ జరుగుతుందన్నారు. టిడిపి, వైసిపి పార్టీలకు 25 మంది ఎంపీలున్నారు. మిగిలిన ఎంపీల మద్దతు కూడ గట్టే బాధ్యత తనదేనని సృష్టం చేశారు.













