Janasena : పదేళ్ల పండగకు సిద్ధమవుతున్న జనసేన.. పిఠాపురంలో ప్లీనరీ..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఇప్పుడు ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం అంత ఆషామాషీగా సాగలేదు. అడుగడుగునా ఆయన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటన్నిటినీ తట్టుకుని నిలబడగలిగారు. వందశాతం స్ట్రయిక్ రేట్ తో చరిత్ర సృష్టించారు. పార్టీ పెట్టి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేడర్ కు దిశానిర్దేశం చేసేందుకు పెద్దఎత్తున ప్లీనరీ ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. మార్చి 12 నుంచి మూడు రోజులపాటు పిఠాపురం (Pithapuram) ఇందుకు వేదికగా మారనుంది.
అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi). ఆయన అడుగుజాడల్లో సినిమాల్లోకి అడుగు పెట్టారు పవన్ కల్యాణ్. అన్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాలని భావించి ప్రజారాజ్యం పార్టీ (Prajarajyam Party) పెట్టారు. అయితే అది సాఫీగా సాగలేదు. కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. కానీ పవన్ కల్యాణ్ రాజకీయ ఆకాంక్షలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవ చేయాలని నిత్యం తపించారు. అందుకే 2014 మార్చి 14న జనసేన పార్టీని (Janasena Party) ప్రకటించారు. అయితే ఆ ఏడాది ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా టీడీపీ (TDP), బీజేపీ (BJP) కూటమికి మద్దతుగా నిలిచారు. దీంతో ఆ కూటమి అధికారంలోకి వచ్చింది.
2019 ఎన్నికల్లో మాత్రం జనసేన పోటీ చేసింది. టీడీపీ, బీజేపీలకు దూరమై సత్తా చాటాలనుకున్నారు పవన్ కల్యాణ్. అయితే ఆ ఎన్నికల్లో జనసేన దారణ ఓటమి చవి చూసింది. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయారు. పార్టీ తరపున ఒక్కరు మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కూడా వైసీపీలో చేరిపోయారు. దీంతో పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది. ఆయనపై అనేక విమర్శలు వచ్చాయి. వైసీపీ ఆయన్ను దారుణంగా ట్రోల్ చేసింది. అయినా పవన్ కల్యాణ్ వెన్నుచూపు చూడలేదు. పార్టీని ముందుకు నడిపించారు. అలాగే వైసీపీని (YCP) ఓడించేందుకు ఈసారి ఎవరితో అయినా కలిసి పోటీ చేయాలనుకున్నారు.
2024 ఎన్నికల నాటికి పవన్ కల్యాణ్ బలమైన శక్తిగా ఎదిగారు. టీడీపీ, బీజేపీలను ఏకతాటిపైకి తీసుకురాగలిగారు. అంతేకాదు.. ఎన్నికల్లో వంద శాతం స్ట్రయిక్ రేట్ సాధించారు. 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసి అన్నిటినీ కైవసం చేసుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రభుత్వంలో కూడా ఆయన కీలక భాగస్వామిగా మారారు. ఉప ముఖ్యమంత్రిగా (Deputy CM) కీలక బాధ్యతలు చేపట్టారు. జీరో నుంచి మొదలైన రాజకీయ ప్రస్థానాన్ని పదేళ్లలో ఓ స్థాయికి తీసుకెళ్లారు.
పార్టీ పెట్టి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్లీనరీ (Plenary) నిర్వహించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇందుకు తన సొంత నియోజకవర్గం పిఠాపురాన్ని ఎంచుకున్నారు. మార్చి 12 నుంచి మూడు రోజులపాటు ఈ ప్లీనరీ జరగనుంది. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. దీన్ని ఘనంగా నిర్వహించాలని తలపెట్టారు. 12, 13 తేదీల్లో వివిధ తీర్మానాలను ఆమోదించడంతో పాటు భవిష్యత్ రాజకీయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. 14వ తేదీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో దీన్ని నిర్వహించాలనుకుంటున్నారు.













