జనసేన నాయకులను అడ్డుకున్న లబ్దిదారులు.. వెళ్లిపోవాలంటూ నినాదాలు..
మంగళగిరిలో జనసేన నాయకులకు చుక్కెదురైంది. టిడ్కో ఇళ్లను పరిశీలించేందుకు వెళ్లిన జనసేన నాయకులను ఇళ్ల లబ్దిదారులు అడ్డుకున్నారు. అనంతరం జనసైనికులపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మంగళగిరిలో ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన జగనన్న నగర్లోని టిడ్కో ఇళ్లను పరిశీలించేందుకు జనసేన నేతలు వెళ్లారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రజలను జనసేనను అడ్డుకున్నారు. తమకు అండగా నిలుస్తూ జగన్ ప్రభుత్వం అన్ని సదుపాయాలతో టిడ్కో ఇళ్లను పంపిణీ చేసిందని.. వాటిపై మీరెందుకు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం మా ఇళ్లకు వచ్చారా అంటూ ఆగ్రహించారు. తమకు కావలసిన అన్ని మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుతున్నాయని, ఇక్కడకు వచ్చి మీరు పరిశీలించడానికీ ఏమీ లేదని, మీ స్వార్థ రాజకీయాలు ఇంకెక్కడైనా చేసుకోవాలంటూ లబ్దిదారులు మండిపడ్డారు. అనంతరం వెంటనే జగనన్న నగర్ నుంచి జనసేన నాయకులు వెళ్లిపోవాలని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో జనసేన నాయకులు, లబ్దిదారుల మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది. అనంతరం పోలీసులు కలుగజేసుకుని జనసైనికులను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.













