భీమవరం బుల్లోడా?
జనసేనాని పవన్ కల్యాణ్ భీమవరం నుంచి పోటీ చేస్తాడా? మళ్లీ భీమవరం నుంచి పోటీ చేసి గెలవాలని భావిస్తున్నాడా? గతంలో ఓడిపోయినా ఈసారి మాత్రం గెలిచే అవకాశాలున్నాయని పవన్ అనుకుంటున్నాడా? భీమవరం జనసేన సభలో తనను గెలిపించాలని అభ్యర్థించడాన్ని బట్టి పవన్ మరోసారి బీమవరం నుంచే పోటీ చేస్తాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోయిన చోటే గెలుచుకోవాలన్నది పవన్ ఉద్దేశ్యంలా కనిపిస్తోంది.దీనికి తోడు ఓడిపోయాడంటూ పదేపదే వైసీపీ నేతల విమర్శలకు.. భీమవరంలో గెల్చి సరైన జవాబివ్వాలని పవన్ భావిస్తున్నట్లు సమాచారం…
భీమవరం జనసేన సభకు హాజరైన జనాన్ని చూసి పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఇక్కడ ఓడిపోయినా.. ఓడిన ఫీలింగే లేదన్నారు. తాను నిజంగా ఓడిపోయి, ప్రజల అభిమానం పొందకుండా ఉండిఉంటే,ఇంతమంది జనం తనను చూసేందుకు వచ్చేవారు కాదన్నారు. తనను మనస్ఫూర్తిగా గెలిపించాలంటూ ప్రజలను అభ్యర్థించారు. అంతే కాదు.. గతంలో తానొక్కడిని గెలిచిఉంటే, వైసీపీ సర్కార్ అక్రమాల్ని సభ లో ఎండగట్టేవాడినన్నారు.
ఇప్పటివరకూ పవన్ సీఎంగా పదేళ్లపాటు అవకాశమివ్వండి… నన్ను సీఎం చేయండంటూ ప్రజల్ని అభ్యర్థిస్తూ వచ్చారు. ఏపీలో వైసీపీ అవినీతిపాలనను అంతం చేద్దామంటూ పిలుపునిస్తూ వస్తున్నారు. అంతేకాదు.. జనసేన అధికారంలోకి వస్తే, వైసీపీ నేతలకు సరైన జవాబిస్తామంటున్నారు. ఓవైపు వైసీపీపై విరుచుకుపడుతూనే.. తాను అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమపథకాలను వివరిస్తున్నారు.తన లక్ష్యాలు, ఆశయాలను ప్రజల ముందుంచుతున్నారు.
వైసీపీ సర్కార్‌పై ప్రజావ్యతిరేకత అధికంగా ఉందని భావిస్తున్న జనసేన సైనికులు సైతం… పవన్ భీమవరం నుంచి పోటీచేస్తా, ఈసారి తప్పకుండా గెలుస్తారంటున్నారు. అదే జనసేన, టీడీపీ పొత్తు ఉంటే పవన్ గెలుపు నల్లేరుపై నడకేనంటున్నారు. సింగిల్‌గా పోటీ చేసినా పొత్తుతో పోటీ చేసినా పవన్‌ను కచ్చితంగా గెలిపిస్తామంటున్నారు జనసైనికులు.













