ఆగ్రహ పవనం…
వారాహి -3 టూర్లో వైసీపీపై పవన్ దండెత్తారు. రుషికొండను బోడికొండ చేశారని నేరుగా వైసీపీ సర్కార్‌పై పవన్ విరుచుకుపడ్డారు. సీఎం జగన్ ప్రజల సొమ్ము దోచుకొంటున్న దోపిడీ దొంగ అని, ప్రభుత్వ భూములు, కొండలు, గుట్టలు, ఇసుక, మట్టి, మద్యం అన్నిటినీ తన గుప్పిట్లో పెట్టుకొని దోచుకొంటున్న ఓ దురాశపరుడైన వ్యాపారి అంటూ చాలా తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారులను, వాలంటీర్లను తన నేరాలలో భాగస్వాములుగా మార్చేసి వారిని కూడా తనతో పాటు జైలుకి తీసుకువెళ్ళబోతున్నారన్నారు.
ఉత్తరాంధ్రలో భూములు, వనరులపై వైసీపీ కన్నేసిందని పవన్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ వాళ్లు తరిమిస్తే ఇక్కడికొచ్చి దోపిడీ మొదలెట్టారని ఆరోపించారు. తెలంగాణను ఇలాగే దోచుకున్నారని ఫైరయ్యారు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి… జైల్లో పెట్టుకోండి,” అంటూ పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వానికి సవాళ్ళు కూడా విసురుతున్నారు. మీ అందరి అవినీతిని బట్టబయలు చేస్తా అంటూ ఆవేశంతో ఊగిపోయారు.
జగన్ సహా మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి చిట్టా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది… కేంద్రం సాయంతో మీ అందరినీ ఓ ఆట ఆడిస్తానంటూ…ఎవరైనా మాజోలికి వస్తే తాట తీస్తానంటూ” పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు. దీనికి మంత్రి అమర్నాథ్ కౌంటరిచ్చారు. మా మీద ప్రధానికే ఫిర్యాదు చేస్తావో లేక అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌కే ఫిర్యాదు చేస్తావో, పుతిన్‌కే చేస్తావో నీ ఇష్టం…” అంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.
ఇదివరకు పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చినప్పుడు పోలీసులతో హోటల్ గదిలో నిర్బందించి, బయటకు వెళ్ళనీయకుండా మళ్ళీ నేరుగా విమానంలో విజయవాడకు తిప్పి పంపించేశారు. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ సభలకు ఆంక్షలు విధిస్తున్నా అనుమతిస్తుండటం గమనిస్తే, ఆయనను టచ్ చేయడానికి వైసీపీ ప్రభుత్వం భయపడుతున్నట్లు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో మాదిరిగా ఆచితూచి మాట్లాడటం లేదు. జగన్‌ను పేరు పెట్టి మరీ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఢిల్లీ పెద్దల అండలేకపోతే పవన్ కళ్యాణ్ ఇంత తీవ్రంగా మాట్లాడి ఉండరు. ఈవిషయం వైసీపీ నేతలకు కూడా బాగానే అర్దమైనట్లుంది. బహుశః అందుకే మాటకు మాటతోనే సరిపెట్టేస్తున్నట్లున్నారు.













