పవన్ స్ట్రాటజీ…
జనసేనాని పవన్ ప్రణాళికలు మార్చేశారా? పార్టీ బలోపేతం, ప్రజాసమస్యలపై ఫోకస్ పెట్టిన పవన్..పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారా? మూడు దశల్లో నిర్వహించిన వారాహితో జనసేనకు మంచి మైలేజే వచ్చిందని చెప్పొచ్చు. అయితే పవన్ కల్యాణ్ నాలుగో విడత వారాహికి మాత్రం కాస్త సమయం పట్టేలా ఉంది. ముఖ్యంగా చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసి, నాలుగో విడత వాారాహికి పవన్ సిద్ధం కానున్నారు. అయితే ముందస్తు అనుమానాలుండడంతో.. ప్రాజెక్టులను కాస్త వేగంగా పూర్తిచేసి ప్రజల్లోకి రావాలన్నది పవన్ అభిమతంగా కనిపిస్తోంది. ఇప్పటికే రూట్ మ్యాప్‌తో సహా ఇతర సన్నాహాలు జరుగుతున్నాయి.
సినిమా కమిట్మెంట్లు ఉన్నప్పటికీ ప్రతి నెలలో సగం రోజులు పార్టీకి సంబంధించిన పనులకే కేటాయించాలని పవన్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పార్టీలో చేరికలు, నియోజకవర్గాల వారీగా బలోపేతం కావడానికి చేపట్టవలసిన చర్యలు, వారాహి యాత్రపై దృష్టి పెట్టడానికి ప్రణాళికలు రచిస్తున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరో రెండు నెలల్లో సినిమాలు కంప్లీట్ చేసి పూర్తి దృష్టిని రాజకీయాలపై పెట్టబోతున్నారని సమాచారం. ఎన్నికలకు ముందు వంద రోజుల పాటు వంద సమావేశాలు నిర్వహించాలనేది పవన్ కళ్యాణ్ వ్యూహంగా తెలుస్తోంది.
ఇక వారాహి యాత్ర పరిధిలోకి రాని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిరంగ సభల కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించే పనిలో పవన్ ఉన్నట్లు సమాచారం.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన మొదటి మూడు విడతల వారాహి యాత్ర తర్వాత రోడ్ మ్యాప్ విషయంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రం మొత్తం కాకూండా కొన్ని ప్రాంతాలకు పరిమితం అవ్వాలని జనసేన నాయకులూ, పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ కి సూచించారని తెలుస్తోంది. అయితే పవన్ కళ్యాణ్ తాజా షెడ్యూల్ ఆధారంగా, అన్ని జిల్లాల్లో పర్యటనలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు ధృవీకరిస్తున్నారు.
మరోవైపు ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జనసేన సిద్ధంగా ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెలలోనే పవన్ కళ్యాణ్ మలివిడత వారాహి యాత్ర ఉంటుందని, దీని కార్యాచరణ త్వరలో ప్రకటిస్తారని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ పొత్తులపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. అయితే అవి ఒక కొలిక్కి వచ్చేలా లేవు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వన్ నేషన్ – వన్ ఎలక్షన్ తీసుకురావడాన్ని స్వాగతించారు. దీనికి జనసేన మద్దతు ఇస్తోందని పవన్ తెలిపారు. ఆ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరిగినా జనసేన సిద్ధంగా ఉండేలా పవన్ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.













