అమరావతికి మద్ధతుగా పోరాటానికే పవన్ మొగ్గు…
మూడు రాజధానుల విషయంలో ఆది నుంచీ వ్యతిరేకత ప్రదర్శిస్తున్న జనసేన పార్టీ అదే పంధాను కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఈ విషయంలో కేంద్రం ఆలోచనలు, గవర్నర్ నిర్ణయం ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కూడా పట్టు పడుతున్న నేపధ్యంలో తాముసైతం తమ పూర్వపంధాకే కట్టుబడి ఉండాలని, అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించే దిశగా వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆదివారం జరిగిన జనసేన పార్టీ కార్యనిర్వాహక సమావేశఃంలో నిర్ణయించారు.
ప్రత్యక్ష పోరాటంలోకి రండి:పవన్
అమరావతిపై తేదేపా, వైసీపీ రెండు పార్టీలూ ద్రోహం చేశాయని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాజధానికి భూములిచ్చిన రైతులకు నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు. రాజధాని అంశం కీలక దశకు చేరుకున్న పరిస్థితుల్లో అమరావతికి మద్ధతుగా ప్రజా ప్రతినిధుల తమ తమ పదవులకు రాజీనామాలు చేయాలని, ప్రత్యక్ష పోరాటంలోకి దిగాలని ఆయన పిలుపిచ్చారు. గత 200రోజులకు పైగా ఉద్యమం చేస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని, వారికి తాము అన్ని రకాలుగా అండదండగా నిలుస్తామని స్పష్టం చేశారు.
మీరు చేస్తే మావాళ్లూ రెడీ: బీటెక్ రవి
తెలుగుదేశఃం పార్టీ ఎమ్మెల్యేలు దమ్ముంటే అమరావతికి మద్ధతుగా రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్న వైసీపీ నేతల సవాల్‌పై తాజాగా అదే అంశంపై రాజీనామా చేసిన ఎమ్మెల్సీ బీటెక్ రవి స్పందించారు. వైకాపా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాము కూడా సిద్ధమని ప్రతి సవాల్ విసిరారు. లేదంటే అమరావతి చుట్టుపక్కల ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దామని ఆయన సూచించారు.













