తిరుపతిలో బిజెపి జస్ట్ పోటీ చేయడమే… ఇన్ని సమస్యలున్నా… సోము ఎక్కడ…?
ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రాష్ట్ర నాయకత్వం కారణంగా కార్యకర్తలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు కొన్ని కొన్ని అంశాలను చాలా వరకు కూడా తేలికగా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. దీంతో అధికార పార్టీ గాని ప్రతిపక్షాలు గానీ ఎక్కడా ఇబ్బంది పడిన పరిస్థితి కనబడలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా మందిని విస్మయానికి గురిచేసింది. వాస్తవానికి ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి పరిధిలో ఒక డివిజన్లో కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించలేదు.
కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేదు. కానీ బిజెపి జాతీయ నాయకత్వం తిరుపతి మీద గట్టిగా దృష్టి పెట్టింది. దీనివలన ఆ పార్టీ కలిసి వచ్చేది ఏంటి అనేది తెలియకపోయినా మీడియా లో హడావుడి మాత్రం ఎక్కువగా చేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడి నేతలతో పెద్దగా మాట్లాడే ప్రయత్నాలు చేయలేకపోతున్నారు అనే భావన ఉంది. వాస్తవానికి తిరుపతి పార్లమెంటు పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం పై ఎన్నో విమర్శలొచ్చాయి. ప్రధానంగా దళితులపై దాడులు తో పాటుగా కొన్ని కొన్ని అంశాలలో తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎక్కువగా విమర్శలొచ్చాయి.
అంతేకాకుండా తిరుపతి వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం టీటీడీ ఆస్తులను విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం తలనొప్పిగా మారింది. వీటిని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడం లేదు. ఆధ్యాత్మిక నగరంగా పేరు ఉన్న తిరుపతిలో కొన్ని ప్రచారాలను బిజెపి బలంగా చేసుకోవాల్సి ఉంటుంది. హిందువులపై దాడులు జరుగుతున్నాయి అనే ఆరోపణలను మొన్నటి వరకు భారతీయ జనతా పార్టీ బలంగా చేసింది. కానీ ఇప్పుడు ఆ ఆరోపణలు చేయలేకపోతుంది.
కొన్ని కొన్ని ఘటనలు హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్నా ఎక్కువగా వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతుంది. ఇక సోషల్ మీడియా విషయంలో సోము వీర్రాజు పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి చాలా మంది కార్యకర్తలు కూడా ముందుకు రావడం లేదు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించే నాయకులు తిరుపతి పార్లమెంటు పరిధిలో ఎక్కడా కనబడడం లేదనే చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి కొంతమంది నేతలను ఆహ్వానించే ప్రయత్నాలు చేయవచ్చు.
వీటి విషయంలో కూడా ప్రయత్నం చేయటం లేదు. ఇక జనసేన పార్టీకి సీట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీ నేతలు ఎంత వరకు పని చేస్తారు ఏంటనేది చెప్పలేని పరిస్థితి. కాబట్టి ఆ పార్టీ నేతలను కలుపుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. తిరుపతి పార్లమెంటు పరిధిలో కాపు సామాజిక వర్గం దళిత సామాజిక వర్గాల ఎక్కువగా ఉన్నాయి. వీళ్లు అందరితో కూడా సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి. కానీ ఇప్పటివరకు కూడా ఎక్కడా ఆ ప్రయత్నాలు చేసినట్టుగా కనబడలేదు. మరి ఎంత వరకు ప్రభావం చూపిస్తారు ఏంటి అనేది చూడాలి.













