జనసేన ప్రధాన కార్యదర్శిగా నాగబాబు..! వర్కవుట్ అవుతుందా..?
జనసేన అంటే పవన్ కల్యాణ్, నాగబాబు, నాదెండ్ల మనోహర్.. మాత్రమే గుర్తొస్తారు. వీళ్ల తర్వాత మిగిలిన నాయకులెవరు.. అంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు కొత్త తరాన్ని తయారు చేసుకోవాలి. లేకుంటే బలమైన నాయకులను ఇతర పార్టీల నుంచి రాబట్టుకోగలగాలి. కానీ జనసేనలో అది జరగట్లేదు. ఉన్న పదవులను వాళ్లే పంచుకుంటున్నారు. ఇప్పుడు జనసేన ప్రధాన కార్యదర్శి బాధ్యతలను సోదరుడు నాగబాబుకు అప్పగించారు పవన్ కల్యాణ్. అంటే మరో కుటుంబసభ్యుడికి పదవి ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడికెళ్లినా జనం తండోపతండాలుగా వస్తారు. వీళ్లంతా ఓటు వేసి ఉంటే గత ఎన్నికల్లోనే కొన్ని సీట్లయినా ఆ పార్టీకి వచ్చేవి. పవన్ కల్యాణ్ కూడా రెండు సీట్లలో ఓడిపోయేవారు కాదు. కానీ అలా మీటింగులకవ వచ్చే వాళ్లంతా ఓట్లేస్తారని చెప్పలేం అనేందుకు జనసేన పార్టీయే పెద్ద ఉదాహరణ. సభల్లో సీఎం పవన్ అని అరిస్తే సరిపోదు.. అలా అరిచేవాళ్లంతా గట్టిగా ఓటేయాలి.. ఓట్లు వేయించాలి.. అప్పుడే సీఎం కాగలను అని ఈ మధ్య పవన్ కల్యాణ్ బహిరంగంగానే ఫ్యాన్స్ కు చెప్పేశారు. దీన్ని బట్టి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది.
పార్టీని బలోపేతం చేసేందుకు పవన్ కల్యాణ ఎంతో ట్రై చేస్తున్నారు. అడపాదడపా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. అయితే ఇది సరిపోవట్లేదు. ఆయన ఒకవైపు సినిమాలు, మరోవైపు పార్టీ నడిపించడం కష్టం. అలాంటప్పుడు సమర్థులైన కొంతమంది నేతలకు బాధ్యతలు అప్పగిస్తే వాళ్లు పార్టీకోసం పూర్తిస్థాయిలో సమయం కేటాయించగలరు. నాదేండ్ల మనోహర్ కూడా పవన్ కల్యాణ్ బయటికి వచ్చినప్పుడు కనిపిస్తారు తప్పా మిగిలిన సమయాల్లో బయటకు రారు. అలాంటి నేతల వల్ల ఉపయోగం లేదు.
ఇప్పుడు నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించారు పవన్ కల్యాణ్. ఈయన కూడా ఎప్పుడోకాని బయటకు రారు. అలాంటప్పుడు పార్టీ ఎలా గాడిలో పడుతుంది. ఇప్పటికే పార్ట్ టైం పొలిటీషియన్ అని పవన్ కల్యాణ్ ను ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తుంటారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పూర్తి సమయం ప్రజల్లో ఉండాలి. అప్పుడే పార్టీ పైన, నేతలపైన నమ్మకం కలుగుతుంది. అలా కాకుండా హైదరాబాద్ లో కూర్చుని పదవులు దక్కించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఇప్పుడు నాగబాబుకు ఇచ్చిన పదవి కూడా అలాగే ఉంటుంది.













