YS Family: జగన్ విలువలు, విశ్వసనీయతను ఎండగడుతున్న తల్లి, చెల్లి..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) పదేపదే విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటారు. ఇవే తనకు ఆస్తులని, వీటితోనే తాను రాజకీయాలు (Politics) చేస్తుంటానని చెప్పుకుంటూ ఉంటారు. చంద్రబాబుకు ఇవి లేవని.. ఆయన్ను నమ్మకూడదని చెప్తుంటారు. ఈ రెండింటి పేటెంట్ తనదే అని.. తానెప్పుడూ విలువలు, విశ్వసనీయతను విడిచి పెట్టననేది జగన్ మాట. కానీ ఇప్పుడు ఈ రెండూ తన మెడకు చుట్టుకుంటున్నాయి. పైగా తన కుటుంబసభ్యులే (YS Family) ఈ రెండు నీకు ఉన్నాయా అని ప్రశ్నిస్తుండడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది. వీటిని తిప్పికొట్టేందుకు ఎంత ప్రయత్నిస్తున్నా వర్కవుట్ కావట్లేదు.
ఎన్నికల్లో విలువలు, విశ్వసనీయత వదిలెపెట్టి అలవికాని హామీలు ఇచ్చి ఉంటే తానే అధికారంలోకి వచ్చి ఉండేవాడినని జగన్ చెప్తూ ఉంటారు. కానీ తనకు అలా చెప్పడం కాదని.. తన పార్టీ వాళ్లు అలా చెప్పాలని చెప్పినా తాను వినలేదని వివరిస్తుంటారు. అతి మంచితనం వల్లే నేను ఓడిపోయానని పార్టీ వాళ్లు చెప్తుంటారని కూడా జగన్ అన్నారు. అయితే జగన్ కుటుంబసభ్యులే ఆయన విలువలను, విశ్వసనీయతను, మంచితనాన్ని ఇప్పుడు ఎత్తి చూపుతున్నారు. వైఎస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు (land disputes) తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో జగన్ నుంచి ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల దూరంగా ఉంటున్నారు.
సరస్వతి పవర్ షేర్లను జగన్ తన తల్లి విజయమ్మకు (YS Vijayamma) 2019 ఆగస్టులో బదిలీ చేశారు. వాటిని విజయమ్మ తన కుమార్తె షర్మిలకు (YS Sharmila) రాసిచ్చారు. అనంతరం షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించి సోదరుడు జగన్ పైనే బాణాలు ఎక్కుపెట్టడంతో ఆయన సహించలేకపోయారు. తను గిఫ్టుగా ఇచ్చిన షేర్లను వెనక్కు తీసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని NCLTకి చెప్పారు. తాను గతంలో తన తల్లికి రాసిచ్చిన షేర్లను ఆమె తన చెల్లికి రాసిచ్చారని.. అవి చెల్లవని తీర్పు చెప్పాలని జగన్ కోరారు. ఇదిప్పుడు NCLTలో విచారణ దశలో ఉంది. దీనిపై తాజాగా విజయమ్మ, షర్మిల కౌంటర్ పిటిషన్లు దాఖలు చేశారు.
విజయమ్మ, షర్మిల దాఖలు చేసిన కౌంటర్ పిటిషన్లలో జగన్ వ్యక్తిత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. మంచితనం, మానవత్వం లాంటివి జగన్ లోనూ, భారతిలోనూ (YS Bharathi) లేవని.. తన కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని విజయమ్మ పేర్కొన్నారు. దీనికంతటికీ కారణం తన కుమారుడు జగనేనని స్పష్టం చేశారు. మరోవైపు సోదరి షర్మిల కూడా జగన్ పదే పదే చెప్తున్న విలువలు ఇవేనా అని రాసుకొచ్చారు. ఇదేనా విశ్వసనీయత అని ప్రశ్నించారు. ఆవిడ గతంలో కూడా మీడియా ముందు ఈ విషయాలను సూటిగా చెప్పుకొచ్చారు. మేనకోడలు, మేనల్లుడి ఆస్తులను కూడా జగన్ కాజేయాలని చూస్తున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో సొంత తల్లి, చెల్లే తనను ఇలా విలువలు, విశ్వసనీయతపై నిలదీయడం జగన్ కు ఇబ్బందికరంగా మారింది.













