కరోనాకు దొరికింది… జగనోరాకి దొరకలేదు : లోకేశ్
2019 తర్వాత రాష్ట్రానికి రెండు వైరస్లు వచ్చాయని, ఒకటి కరోనా, రెండోది జగనోరా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ దొరికిందని, జగనోరాకు ఇంకా మందు దొరకలేదని వ్యాఖ్యానించారు. యువగళం పాదయాత్రలో భాగంగా తాడికొండలో ఆడిటర్లతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ రాజకీయాలు, వృత్తి వేర్వేరని, కానీ వైసీపీ ప్రభుత్వం ప్రతి దాన్నీ రాజకీయంగానే చూస్తోందన్నారు. మార్గదర్శిపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు.
జగన్ సీఎం కాగానే ప్రజావేదిక కూల్చడంతోనే విధ్వంసం మొదలు పట్టారు. అమరావతిని నాశనం చేశారు. కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్తున్నాయి. ఆడిటర్లకు రాష్ట్రంలో పనిలేకుండా పోయింది. ఒకే ఒక్క వ్యక్తి వల్ల రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది నష్టపోయారు. అమరరాజా వంటి కంపెనీలను బయటకు గెంటారు. కులం అంటగట్టి మరీ పారిశ్రామికవేత్తలను వేధించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం. అభివృద్ధితో పాటు సంక్షేమం మా విధానం. అభివృద్ధి చక్రాల ఆధారంగా సంక్షేమం బండి నడవాలి. టీడీపీ హయాంలో 120 సంక్షేమ కార్యక్రమాలు అలు చేశాం. అప్పులు చేసి సంక్షేమం విఫలమైన విధానం. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈజ్ ఆఫ్ డూయింగ్‌తో పాటు కాస్ట్ ఆఫ్ డూయింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటాం అని అన్నారు.













