YS Jagan Cases : జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కదలక.. ఇబ్బందులు తప్పవా..!?
వై.ఎస్.రాజశేఖర రెడ్డి (YSR) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయన కుమారుడు వైఎస్ జగన్ (YS Jagan) పై అక్రమాస్తుల వ్యవహారం (Illegan Assets) బయటకు వచ్చింది. అయితే వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ సొంత పార్టీ పెట్టడం, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడడం లాంటి పరిణామాలు ఆయనకు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టాయి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అక్రమంగా ఆస్తులను కూడబెట్టారని.. క్విడ్ ప్రో కోకు (Quid pro quo) పాల్పడ్డారని జగన్ పై అనేక కేసులు నమోదయ్యాయి. అయితే వీటన్నింటిలోనూ జగన్ కు బెయిల్ దొరికింది. ఇప్పటికీ ఆయన బెయిల్ పైనే ఉన్నారు. దాదాపు 11 ఏళ్లుగా బెయిల్ పైన ఉండడం జగన్ గొప్పతనం. అయితే ఇప్పుడు ఆ కేసుల్లో ముందడుగు పడుతోంది.
జగన్ అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ (CBI), ఈడీ (ED) నమోదు చేసిన అన్ని కేసుల వివరాలను తమకు రెండు వారాల్లో ఇవ్వాలని ఆదేశించింది. పదేళ్లకు పైగా జగన్ అక్రమాస్తుల కేసులు ముందుకు సాగట్లేదని.. విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Raghu Rama Krishna Raju) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. డిశ్చార్జ్ పిటిషన్ల వల్లే విచారణ ముందుకు సాగట్లేదని సీబీఐ, ఈడీ వివరించాయి. అయితే ఈకేసుల తాజా పరిస్థితి ఏంటో సమగ్రంగా తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
జగన్ పై ఇప్పటి వరకూ ఏఏ కేసులు నమోదయ్యాయి.. ఏవేవి పెండింగులో ఉన్నాయి.. తెలంగాణ హైకోర్టు ఏమని ఆదేశాలిచ్చింది.. ట్రయల్ కోర్టులో స్టేటస్ ఏంటి.. వేటిపైన డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు.. ఏఏ కేసుల్లో బెయిల్ పొందారు.. లాంటి అంశాలన్నింటినీ తమకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దాదాపు 12 ఏళ్లు కావస్తున్నా ఈ కేసుల్లో విచారణ సాగకపోవడం, నిందితులు బెయిల్ పైన ఉండడం, పైగా బెయిల్ నిబంధనలను కూడా పూర్తిగా పాటించకపోవడం.. జగన్ కోర్టుకు హాజరు కాకపోవడం.. లాంటి అంశాలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు రఘురామ కృష్ణరాజు (RR) న్యాయవాదులు. దీంతో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీవ్రంగానే పరిగణించింది. కేవలం 2 వారాలు మాత్రమే గడువిచ్చింది.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు (Chandrababu) ముందుంటారని.. అందుకే ఆయన కేసుల నుంచి తప్పించుకుంటున్నారని జగన్ పదే పదే విమర్శిస్తుంటారు. అయితే జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తుండడం వల్లే ఇన్నేళ్లుగా బయట తిరుగుతున్నారని.. న్యాయస్థానం ఆదేశాలను కూడా పట్టించుకోవట్లేదని టీడీపీ (TDP) ఆరోపిస్తోంది. ఈ కేసుల విచారణ ప్రారంభమై తీర్పులు వెల్లడిస్తే జగన్ కచ్చితంగా దోషిగా తేలతారనే నమ్మకం టీడీపీ నేతల్లో ఉంది. ఆయనకు రెండేళ్లకు పైబడి శిక్ష పడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఆ ఆశతోనే ఇప్పుడు టీడీపీ పైట్ చేస్తోంది. వీలైనంత త్వరగా ఈ కేసుల విచారణ పూర్తి కావాలని కోరుకుంటోంది. ఇన్నాళ్లు స్తబ్దుగా సాగిన ఈ కేసుల దర్యాప్తు ఇక వేగం పుంజుకుంటుందనే నమ్మకం కూటమి పార్టీల్లో కనిపిస్తోంది. అదే జరిగితే జగన్ కు ఇబ్బందికర పరిణామాలు తప్పకపోవచ్చు.













