జగనన్న పేరు మాయం.. పథకాలు సేఫ్.. లోకేష్ సూపర్ పాలిటిక్స్..
విద్యాశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టిన అనంతరం నారా లోకేష్ చాలా తెలివిగా పావులు కదుపుతున్నారు. విద్యాశాఖ పై తనదైన ముద్ర ఉండాలి అనే తపనతో పని చేస్తున్న లోకేష్ పాత ప్రభుత్వం గుర్తులు లేకుండా చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైసిపి ప్రభుత్వం అవసరం ఉన్నా లేకున్నా.. కనిపించిన ప్రతి పథకానికి జగనన్న పేరు జోడిస్తూ వెళ్ళింది. రైతుల పాస్ పుస్తకాలపై, పొలం గట్ల మీద వేసే రాళ్లపై కూడా జగన్ ఫోటోలు ఉండడం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జగన్ సతీమణి భారతిని ఇదే విషయం ఒక రైతు కూడా ప్రశ్నించారు. అప్పట్లో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. జగన్ పేరు మారుమోగాలి అనే వైసిపి నేతల తపన ఒకరకంగా వారి ఓటమికి కారణమయ్యింది. అయితే ఈ స్ట్రాటజీని పూర్తిగా మారుస్తున్నారు కూటమినేతలు.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పేర్లను ఎక్కడా ఉంచరు అని అందరూ ముందుగానే భావించారు. అదేవిధంగా విద్యాశాఖలో లోకేష్ జగన్ పేరును పూర్తిగా మార్చేస్తూ వస్తున్నారు. అరడజనుకు పైగా ఉన్న పథకాలకు జగన్ పేర్లను తొలగిస్తూ లోకేష్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏమిటో ?మారినా ఆ పథకాల కొత్త పేర్లు ఏమిటో? తెలుసుకుందాం..
జగనన్న అమ్మ ఒడి పథకం తల్లికి వందనంగా మారింది.. జగనన్న విద్యా కానుక సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా మార్చారు. జగనన్న గోరుముద్ద కాస్త డొక్కా సీతమ్మ మధ్యాహ్నబడి భోజనం గా మార్చడం జరిగింది. మనబడి నాడు మనబడి నేడు అన్న పథకానికి మన భవిష్యత్తు అనే పేరు పెట్టగా స్వేచ్ఛ అన్నదానికి బాలిక రక్ష అన్న పేరును ఖరారు చేశారు. ఇక జగనన్న ఆణిముత్యాలు అనే పథకానికి అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అనే పేరును పెట్టారు. లోకేష్ మొత్తానికి ఎక్కడా జగన్ ఆనవాలు కూడా లేకుండా పేర్లను మార్చినప్పటికీ వివాదాస్పదం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం గమనార్హం. .













