జన సంక్షేమమే ధ్యేయంగా సాగిన జగన్ పాలనకు 4 ఏళ్ళు
జనసంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సంక్షేమాంధ్రప్రదేశ్‌గా మార్చిన జననేత జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన చేపట్టి 4 ఏళ్ళు పూర్తయింది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 4 ఏళ్లలోనే 98 శాతం పూర్తిచేసిన ఘనతను సాధించిన ప్రభుత్వం ఇది. రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకువచ్చిన జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. రాజ్యాధికారంలో సింహభాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే వాటా ఇచ్చి సామాజిక మహావిప్లవాన్ని ఆవిష్కరించడంతోపాటు, విప్లవాత్మక సంస్కరణల ద్వారా సుపరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జనరంజక పాలనకు నాలుగేళ్ళు. దేశంలోనే అతి పిన్న వయస్సులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారిలో ఒకరిగా ఉన్న ముఖ్య మంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలోనూ కేంద్రం నుండి రాష్ట్రానికి రావల్సిన పెండింగ్ నిధులను తీసుకురావడంలోనూ అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు.
2019 మే 30వ తేదీ ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన ఇటీవల నాలుగేళ్ల పాలనను పూర్తిచేసుకుని ఐదో సంవత్సరంలోకి విజయవంతంగా అడుగుపెట్టారు. గడచిన నాలుగేళ్లలో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 98.5 శాతం ఆచరణలో అమలుచేసి చూపించి సరికొత్త చరిత్రను ఆయన సృష్టించారు. ఇచ్చిన హామీలతోపాటు ఆయా ప్రాంతాల్లో అవసరమైన ప్రతి అంశానికి సంబంధించి పరిష్కారం కోసం మరికొన్ని పథకాలను తెరమీదకు తీసుకొచ్చి లోటు బడ్జెట్లోనూ ప్రజలకు నూటికి నూరు శాతం సంక్షేమ పథకాలను అమలుచేస్తూ రాష్ట్రంలోని పేద ప్రజల మన్ననలు పొందుతున్నారు. సంక్షేమ పథకాలతోపాటు ఆయా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ పాలనాపరంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని వివాదంగా మారినప్పటికీ విజయం సాధిస్తూ సీఎం జగన్ ప్రజలకోసం వేగంగా ముందడుగు వేస్తున్నారు. అలాగే పేద ప్రజలకు అవసరమైన పథకాలతోపాటు విద్య, వైద్య రంగానికి సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ వస్తున్నారు. పై రెండు రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడంతోపాటు వేల కోట్ల నిధులను వెచ్చించి సర్కారు బడులను కార్పొరేట్ సాఠశాలలకు ధీటుగా అభివృద్ధి చేస్తూ వస్తున్నారు. అలాగే ప్రభుత్వ వైద్య శాలలను కూడా పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పేద ప్రజలకు 24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
అందులో భాగంగానే విలేజ్ క్లీనిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. అదేవిధంగా రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉన్న తొమ్మిది రంగాలను బలోపేతం చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పటిష్టతకు బలమైన ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ జీవనడాడి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేసేందుకు అవసరమైన నిధులను కేంద్రం నుండి తీసుకొచ్చేందుకు గడచిన నాలుగేళ్లుగా సీఎం జగన్ గట్టి ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఫలితంగానే పోలవరం పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకంగా సాగు నీటి పథకాలను పైలట్ ప్రాజెక్టు కిందకు తీసుకొచ్చి వీలైనంత త్వరగా ఆ పనులను పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 50 శాతానికి పైగా ఓట్లతో 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. 2019 మే 30న ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని సంక్షేమ పథకాలను అమలు చేయడం ప్రారంభించారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా తన సంక్షేమ పథకాల అమలు పరంపరను యథావిధిగా కొనసాగించారు. 2019 ఎన్నికల్లో తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలలో 98.5 శాతం అమలు చేసి గత నాలుగేళ్లలో రికార్డు సృష్టించారు. వచ్చే మే వరకు కొనసాగనున్న తన పదవీకాలంలో సీఎం జగన్ నవరత్నాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుని ముందుకు సాగుతున్నారు.
ఇక తొలిసారిగా ఏర్పాటుచేసిన మంత్రివర్గంలో 56 శాతం.. పునర్వ్యవస్థీకరణ ద్వారా ఏర్పాటుచేసిన కేబినెట్లో 70 శాతం పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చి సామాజిక న్యాయంలో సీఎం జగన్ దేశానికి ఆదర్శంగా నిలిచారు. రాజ్యసభ, శాసనమండలి సభ్యుల నుంచి నామినేటెడ్ పదవుల వరకూ సింహభాగం ఆ వర్గాలకే కేటాయించి సామాజిక సాధికారత దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని వర్గాల మన్ననలు పొందేలా పాలన అందిస్తూ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన రెట్టింపు చేసుకున్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా, మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథాలైన భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా అమలు చేసి చూపించారు. అందుకే ధైర్యంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ద్వారా ఎన్నికలు రాకముందే ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి పంపించే కార్యక్రమం చేపట్టారు. నాలుగేళ్ల పాలనతో ఇంటింటికి, మనిషి మనిషికి ఏం మేలు జరిగిందనే విషయాన్ని ఎమ్మెల్యేల ద్వారా స్వయంగా వివరించడమే కాకుండా.. ప్రింట్ చేసిన పుస్తకాలను వారికి ఇచ్చి, ఆ మేలు జరిగిందా లేదా అని ధైర్యంగా అడిగి ప్రజల మద్దతు పొందుతున్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చినందునే ఎమ్మెల్యేలు ధైర్యంగా ప్రజల దగ్గరకు వెళ్లగలుగుతున్నారు. మరో పక్క వ్యవసాయ, విద్య, వైద్య రంగాల్లో పరిపాలనలో సంస్కరణల ద్వారా విప్లవాత్మక మార్పులు తెచ్చారు. గ్రామ, వార్డు స్థాయికి పరిపాలనను, పథకాలను, పౌర సేవలను పారదర్శకంగా తీసుకెళ్లారు. తద్వారా గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
రూ.3.02 లక్షల కోట్లు సాయం
నాలుగేళ్లలో అన్ని వర్గాలకు నవరత్నాల కింద డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా 10.46 కోట్ల ప్రయోజనాల కోసం ఏకంగా రూ.3.02 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇందులో డీబీటీ ద్వారా 7.90 కోట్ల ప్రయోజనాలకు రూ.2.11 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 2.57 కోట్ల ప్రయోజనాల కింద రూ.91 వేల కోట్లు వ్యయం చేశారు. సంక్షేమంలో బీసీలకు సామాజిక న్యాయం జరిగింది.
ఎపికి పెట్టుబడులు రాక…
పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి దృష్టి సారించి విజయం సాధించారు. ఇప్పుడు అభివృద్ధిలో ఏపీ ముందంజలో నిలుస్తోంది. గత మూడేళ్లుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్‌లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. ఈక్రమంలోనే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ద్వారా రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులను పొందడంలో సీఎం జగన్ విజయం సాధించారు. ఇది 6 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుంది. 2018-19లో 3.2 శాతం ఉన్న పారిశ్రామిక వృద్ధిని 12.8 శాతానికి అంటే నాలుగు రెట్లు- పెంచుతూ ఈ సదస్సులో ఒప్పందాలు జరిగాయి.
వికేంద్రీకరణకు పెద్ద పీట
ప్రభుత్వ పరిపాలనలో వికేంద్రీకరణకు పెద్ద పీట వేశారు. అధికార, పరిపాలనా వికేంద్రీకరణ నినాదాలు మొదట్లో కొంత వ్యతిరేకతను తెచ్చిపెట్టినా ఇప్పుడవే ప్రభుత్వానికి వన్నె తెచ్చి పెడుతున్నాయి. ఇందులో పెద్ద విప్లవం గ్రామ మరియు వార్డు సచివాలయాలను ఏర్పాటు- చేయడం. ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకు తీసుకురావడం. అలాగే, జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. దాని కింద 26 జిల్లాలు ఏర్పాటు జరిగింది. పరిపాలన వికేంద్రీకరించబడిరది.
విలేజ్ హెల్త్ క్లినిక్స్
గ్రామ, వార్డు స్థాయిలో క్లినిక్స్ ఏర్పాటు చేసి ప్రజల ముగింటకే ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దాదాపు 10,032 విలేజ్ హెల్త్ క్లినిక్స్, 528 వార్డు హెల్త్ క్లినిక్స్ నిర్మాణం ముమ్మరంగా కొనసాగుతోంది. కొత్తగా 150 పీహెచ్‌సీలతో పాటు 992 పీహెచ్‌సీలు ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి.
విద్యారంగంలో సమూల మార్పులు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో విద్యారంగంలో సమూల మార్పులను తీసుకువచ్చారు. కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా, ప్రభుత్వ స్కూళ్ళను ఆధునీకరించారు. సకల వసతులను కల్పిస్తున్నారు. ఇందుకోసం ఎన్నో పథకాలను జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది.
మన బడి నాడు`నేడు కార్యక్రమంలో భాగంగా 61,661 స్కూళ్ల రూపు రేఖలు మార్చేందుకు ఏకంగా రూ.16,450.69 కోట్లు వ్యయం చేసేందుకు ప్రణాళికను రూపొందించి అమలు చేస్తోంది. ఇప్పటికే తొలి దశలో 15,713 స్కూళ్లలో రూ.3,697.86 కోట్లతో పనులు పూర్తి చేశారు. ఈ స్కూళ్లన్నీ 10 రకాల వసతులతో కార్పొరేట్ స్కూళ్లను మించి సర్వాంగ సుందరంగా దర్శనమిస్తున్నాయి. నాడు`నేడు రెండో దశలో 22,344 స్కూళ్లలో రూ.8,000 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నారు. తొలి దశలో ఆయా గ్రామాల్లో రూపు రేఖలు మారిన స్కూళ్లను చూస్తే.. గతానికి, ఇప్పటికి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. సకల మౌలిక వసతులు సమకూర్చిన స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి డిజిటల్ తరగతులు ప్రారంభిస్తున్నారు. దశల వారీగా గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల నిర్మాణం చేపడుతున్నారు. తొలి దశలో రూ.575 కోట్ల వ్యయంతో 3,589 డిజిల్ లైబ్రరీల నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. పట్టణాల నుంచి సొంతూరు వెళ్లినా, అక్కడి నుంచే పనిచేసేలా డిజిటల్ లైబ్రరీలను చేపడుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది.
పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది.
ఇదే కాకుండా ప్రతి శాఖలోనూ తనదైన పాలనా ముద్రను వేసి అన్నీ శాఖలు ప్రజాసంక్షేమానికి పాటుపడేలా ముఖ్యమంత్రి చేసిన కృషి ఆయన పాలనను చిరస్థాయిగా నిలిచేలా చేస్తోంది.
వైద్యవిద్యలో నూతన అధ్యాయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వైద్య విద్యలో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటామన్న హామీని నెరవేరుస్తూ ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలలకు అదనంగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. వీటిలో ఈ విద్యా సంవత్సరం (2023`24) ఐదు కళాశాలల్లో 750 ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశాలకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) అనుమతి ఇచ్చింది. మచిలీపట్నం, ఏలూరు, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం కళాశాలల్లో ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైద్య విద్యా రంగం అభివృద్ధికి వేగంగా చర్యలు చేపట్టారు. నాడు ` నేడు పథకం కింద రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చుతో ప్రభుత్వ వైద్య రంగం బలోపేతానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా రూ.8,480 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ వంటి ఒడిదుడుకులను కూడా అధిగమించి వైద్య కళాశాలలు నిర్మిస్తున్నారు. వీటిలో ఐదు కాలేజీలు ఈ ఏడాది ప్రారంభమవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న 11 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 2,185 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలతో మరో 750 సీట్లు పెరుగుతాయి. దీంతో ప్రభుత్వ రంగంలోనే రాష్ట్రంలో 2,935 సీట్లు ఉంటాయి. వీటిలో 15 శాతం ఆల్ ఇండియా కోటాలో భర్తీ చేస్తారు. మిగిలిన సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. వచ్చే ఏడాది పులివెందుల, పాడేరు, ఆదోని కళాశాలలు, ఆ తర్వాతి ఏడాది మిగిలిన తొమ్మిది కళాశాలలు ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పటికే ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను రూ.3,820 కోట్లతో బలోపేతం చేస్తోంది. అంతేకాకుండా ఎన్ఎంసీ నిబంధనలకు అనుగుణంగా వైద్య కళాశాలల్లో మానవ వనరులు, ఇతర సదుపాయాలను సమకూర్చింది. వీటన్నింటి ఫలితంగా 627 పీజీ సీట్లు పెరిగాయి. తద్వారా భవిష్యత్‌లో రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యుల సంఖ్య పెరగనుంది.













