ముందస్తు ముచ్చటే లేదు.. కేబినెట్లో కన్ఫామ్ చేసిన సీఎం జగన్..!
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని.. అందుకే సీఎం జగన్ శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పది రోజులుగా మీడియాలో జోరుగా కథనాలు వచ్చాయి. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉండగానే కేబినెట్ మీటింగ్ షెడ్యూల్ కావడంతో ముందస్తు ఊహాగానాలకు మరింత బలం చేకూరుంది. దీంతో 7న జరిగే కేబినెట్లో ముందస్తు ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంటారని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అయితే అందరి ఆశలపై నీళ్లు చల్లుతూ సీఎం జగన్ ముందస్తు ముచ్చటే లేదని తేల్చి చెప్పేశారు.
వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి ఒక క్లారిటీ ఉంది. మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా, విపక్షాలు ఎన్ని అనుకున్నా ఆయనేం పట్టించుకోరు. తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. వైసీపీ పనైపోయిందని, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ వీకైపోయిందని.. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని సోషల్ మీడియాలో విపరీతంగా కథనాలు వస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మోయలేని భారంగా మారిందని, అందుకే జగన్ ఢిల్లీ చుట్టూ తిరిగి ముందస్తు ఎన్నికలకోసం మంతనాలు సాగిస్తున్నారని చెప్పుకొచ్చాయి. వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిస్థితి అలాగే ఉండడంతో అది నిజమే కాబోలు అని అందరూ అనుకున్నారు.
మరోవైపు విపక్షాలు కూడా ఏడాది ముందు నుంచే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కోడై కూస్తున్నాయి. టీడీపీ శరవేగంగా బలపడిపోతోందని, అందుకే జగన్ భయపడిపోతున్నారని చెప్పుకొచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ కు వాస్తవం అర్థమైందని, అందుకే త్వరగా ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని చెప్తూ వచ్చాయి. టీడీపీతో పాటు జనసేన కూడా ఇదే చెప్పుకొచ్చింది. దీంతో తమ కార్యక్రమాలను విపక్షాలను స్పీడప్ చేశాయి. ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్లిపోయాయి. టీడీపీ అయితే మేనిఫెస్టో కూడా పాక్షికంగా ప్రకటించేసింది. ఇక ఎన్నికలే తరువాయి అని.. ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని సవాల్ విసిరింది.
ఇటీవల జగన్ నీతిఆయోగ్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన సమయంలో మోదీ, అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర నేతలను కలిసారు. అదే సమయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం 7న జరుగుతుందని నోటిఫికేషన్ వచ్చింది. దీంతో జగన్ ముందస్తు ఎన్నికలకు కేంద్రం నుంచి అనుమతి పొందారని, ఈ విషయాన్ని కేబినెట్ లో చెప్పి అప్రూవల్ తీసుకునేందుకే అత్యవసరంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారని మీడియా భావించింది. ఆగస్టులో మంత్రివర్గాన్ని రద్దు చేసి డిసెంబర్లో తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్తారని అంచనా వేసింది. దీంతో 7న జరిగే కేబినెట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసింది.
అయితే కేబినెట్ సమావేశంలో ముందస్తు ముచ్చటే లేదని సీఎం జగన్ క్లారిటీ ఇచ్చేశారు. అలాంటి అవసరం లేదని.. ఇంకో 9 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. వాటికి పార్టీ కేడర్ అంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. ముందస్తు ఎన్నికలపై సహచర మంత్రులు అడిగినప్పుడు జగన్ నవ్వి ఊరుకున్నట్టు సమాచారం. దీంతో ముందస్తు తొందర లేదని, 9 నెలల్లో పూర్తిగా ప్రజల్లోకి వెళ్లేందుకు సమయం దొరికిందని కేబినెట్ మంత్రులు సంతోషం వ్యక్తం చేశారు. మొత్తానికి ముందస్తు లేదని క్లారిటీ రావడంతో వైసీపీ కేడర్ ఊపిరి పీల్చుకుంది.













