చెప్పేందుకు ఏమీ లేకపోవడంతో.. ఇలా : లోకేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ప్రచార పిచ్చి పెరిగిపోయిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. విద్యార్థులు కాలకృత్యాలు తీర్చుకునే మరుగుదొడ్ల వద్ద జగనన్న ఆరోగ్య సురక్ష మూత్రశాల, మరుగుదొడ్లు అంటూ పలు ప్రాంతాల్లో కనిపిస్తోన్న ఫ్లెక్సీల ఏర్పాటుపై లోకేశ్ వ్యంగ్యంగా స్పందించారు. ప్రజల కోసం ప్రభుత్వం ఫలానా పని చేసిందని చెప్పేందుకు ఏమీ లేకపోవడంతో ఇలా ఫ్లెక్సీలు పెడుతున్నారన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమైనా మిగిలిపోయేమో వెతుక్కోండని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు లేక రోజుకో నిరుద్యోగి ఆత్మహత్యకు పాల్పడుతుంటే ఏమీ పట్టనట్టు చివరకు ఇలా ఫ్లెక్సీలు కట్టుకుంటూ పోతున్నారని మండిపడ్డారు.













