Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మృతి.. వెలుగులోకి కొత్త అంశాలు..!!
పాస్టర్ ప్రవీణ్ పగడాల (Pastor Praveen Pagadala) మృతి విషయంలో గత కొద్ది రోజులుగా అనేక అనుమానాలు, ఆరోపణలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి (Rajahmundry) సమీపంలో మార్చి 25న ప్రవీణ్ మృతి చెందారు. హైదరాబాద్ (Hyderabad)లో పాస్టర్ గా పనిచేస్తున్న ప్రవీణ్ తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌పై రాజమండ్రికి వెళుతూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని పోలీసులు మొదట చెప్పారు. అయితే, ఆయనది రోడ్డు ప్రమాదం కాదని, ఆయన్ను కావాలనే ఎవరో హత్య చేశారని కొందరు వాదించారు. దీంతో దీనిపై సమగ్ర విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ కేసులో ఇప్పుడు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ప్రవీణ్ పగడాల మార్చి 24న హైదరాబాద్ నుంచి బైక్‌పై (bike riding) బయలుదేరారు. రాజమండ్రి సమీపంలోని కొంతమూరు వద్ద మార్చి 25 తెల్లవారుజామున ఆయన రోడ్డుపక్కన విగతజీవిగా పడి ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో అతను కొవ్వూరు టోల్ గేట్ వద్ద బైక్ నడుపుతూ కనిపించాడు. పోలీసులు ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదమని, బైక్ స్కిడ్ అయి పడిపోవడంతో తలకు గాయాలై చనిపోయాడని తెలిపారు. అయితే, అతని సన్నిహితులు, కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాలు ఈ వాదనను నమ్మలేదు. కొందరు ఇది హత్య అని, ప్రభుత్వం వాస్తవాలను దాచిపెడుతోందని ఆరోపించారు.
రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. పాస్టర్ ప్రవీణ్ మరణంపై సమగ్ర దర్యాప్తుకోసం JAC ఏర్పాటైంది. కొందరు రాజకీయ నాయకులు, మతపరమైన సంస్థలు ఈ సంఘటనను మతవిద్వేషాలకు లింక్ చేస్తూ ఆందోళనలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ (Ex MP Harsha Kumar) ఇది హత్యేనని, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసుపై సమగ్ర, పారదర్శక విచారణకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఇప్పుడు పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన కొత్త ఆధారాలు ఈ ఆరోపణలన్నింటినీ పటాపంచలు చేస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ తో పాటు ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించినప్పుడు ఆయన దారిలో మద్యం కొనుగోలు చేసినట్లు తేలింది. కోదాడలో మద్యం కొనుగోలు చేసిన ఆయన విజయవాడ వెళ్లేలోపో ఓసారి ప్రమాదానికి గురయ్యారు. అతని బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయింది. రామవరప్పాడు రింగ్ రోడ్ (Ramavarappadu) వద్ద ఓ ట్రాఫిక్ పోలీస్ అతడిని బైక్ పై వెళ్లొద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన రోడ్డుపక్కనే గడ్డిపై దాదాపు 3 గంటలు పడుకుని నిద్రపోయినట్లు సమాచారం. దీంతో అతను మద్యం తాగి డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదవశాత్తూ పడి చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే పోలీసులు అధికారికంగా ఈ విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.
మద్యం కొనుగోలు ఆధారాలు బయటకు రావడంతో హత్యారోపణలు చేసిన వారంతా ఇప్పుడు నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ కొత్త వాస్తవాలు ప్రవీణ్ గౌరవాన్ని దెబ్బతీశాయి. అలాగే అతని మరణం చుట్టూ మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని చూసిన వారిని కూడా ఇబ్బంది కలిగించాయి. పాస్టర్ ప్రవీణ్ పాస్టర్ గా సుప్రసిద్ధులు. ఆయనకు ఎంతోమంది అనుచరులున్నారు. మద్యం సేవించి వాహనం నడపడం అనేది ఒక పాస్టర్ నుంచి సమాజం ఆశించదు. అతనికోసం పోరాడిన వాళ్లు కూడా ఇలాంటిది అస్సలు ఊహించి ఉండరు. వాస్తవాలు తెలియకముందే ఆరోపణలు చేయడం, మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం సమాజానికి హాని కలిగిస్తుంది. ప్రవీణ్ మరణం వెనుక ఉన్న నిజం ఏదైనా, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఆధారాలు అతని గౌరవాన్ని దెబ్బతీసాయనడంలో సందేహం లేదు.













