ఐవైఆర్ కృష్ణారావు పై వేటు
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, మాజీ సీఎఎస్ ఐవైఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో షేర్ చేసిన కామెంట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యాడు. తాను చేసిన షేర్లపై ఐవైఆర్ కృష్ణారావు వివరణపై ప్రభుత్వం సంతృప్తి చెందలేదు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్లు పెట్టడమే కాకుండా, ఇటీవల బాలకృష్ణ నటించిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడాన్ని ఐవైఆర్ తప్పుబట్టారు. ఇతరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లను ఆయన షేర్ చేయడం పట్ల చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో పాటు ఐవైఆర్ వ్యవహార శైలిపై చంద్రబాబుకు టీడీపీ నేతల నుంచి కూడా భారీగా ఫిర్యాదులందాయి. దీంతో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్ బుక్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్లు చేశారని ఆరోపిస్తూ ఆయనపై వేటు వేసింది.













