దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు చంద్రబాబు పనేనా..?
వైసీపీ నేత దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు ఏపీలో కలకలం రేపాయి. సుమారు 36 గంటలపాటు ఈ సోదాలు జరిగాయి. అయితే దేవినేని అవినాశ్ ఇంట్లో ఐటీ సోదాలు ఎందుకు జరిగాయి.. ఏం జరిగింది.. అనే ప్రశ్నలు సర్వత్రా ఆసక్తి కలిగించాయి. దేవినేని నెహ్రూ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అవినాశ్ మొదట టీడీపీలో ఉండి తర్వాత వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఆ పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్న నేతపై, అది కూడా బీజేపీకి సన్నిహితంగా ఉన్న వైసీపీకి చెందిన నేతపై ఐటీ దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది.
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకూ జరిగిన సోదాల్లో పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా దేవినేని అవినాశ్ ఇంట్లోని కంప్యూటర్లలోని సమాచారాన్ని హార్డ్ డిస్కుల్లో కాపీ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏ అంశానికి సంబంధించి ఈ సోదాలు చేశారో ఐటీ అధికారులు వెల్లడించలేదు. ఏం స్వాధీనం చేసుకున్నారో కూడా చెప్పలేదు. అయితే సోదాలు ముగిసిన అనంతరం దేవినేని అవినాశ్ స్పందించారు. తమ జీవితం తెరిచిన పుస్తం అన్న అవినాశ్.. తనకు ఎలాంటి వ్యాపారాలూ లేవన్నారు. తాము రాజకీయాలు మాత్రమే చేస్తామన్నారు. రాజకీయమో.. వ్యాపారమో.. ఏదో ఒకటి మాత్రమే చేయాలని నాన్న దేవినేని నెహ్రూ ఎప్పుడూ చెప్పేవారని.. అందుకే తాను రాజీకీయాలకు మాత్రమే పరిమితం అయ్యానని అవినాశ్ వివరించారు. హైదరాబాద్ లో ఒక స్థలం ఉందని.. దాన్ని డెవలప్మెంట్ కు ఇచ్చామని .. దానిపై ఏదైనా వివాదం ఉంటే కోర్టులు చూసుకుంటాయని వెల్లడించారు.
దేవినేని అవినాశ్ వివరణ ఇస్తున్న సమయంలో చేసిన ఓ కామెంట్ ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. తనపై దాడుల వెనుక చంద్రబాబు కుట్ర ఉందని అవినాశ్ ఆరోపించారు. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు ఇవన్నీ చేయిస్తున్నారన్నారు. ఇదిప్పుడు వైరల్ అవుతోంది. టీడీపీకి ఇప్పుడు అధికారంలేదు. కేవలం ప్రతిపక్ష హోదా మాత్రమే ఉంది. అది కూడా చాలా బలహీన ప్రతిపక్షంగా గుర్తింపు పొందింది. అటు కేంద్రంలో కానీ, ఇటు రాష్ట్రంలో కానీ చక్రం తిప్పేంత స్థాయి చంద్రబాబుకు ఇప్పుడు ఏమాత్రం లేదు. కేంద్రంలోని అధికార బీజేపీ ప్రాపకం కోసం చంద్రబాబు ఇప్పుడు వెంపర్లాడుతున్న పరిస్థితి ఉంది. అలాంటి చంద్రబాబు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఇలా ఐటీ దాడులు చేయిస్తున్నారని వైసీపీ నేత దేవినేని అవినాశ్ చెప్పడం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.













