మినీ అమీర్పేటగా మారనున్న మంగళగిరి
రానున్న రోజుల్లో మంగళగిరి పట్టణం మినీ అమీర్పేటగా మారుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్లో రూ.600 కోట్లతో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి డేటా సెంటర్ రావడం సంతోషంగా ఉందన్నారు. ఇది ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద డేటా కేంద్రాల్లో ఒకటిగా నిలవనుందన్నారు. త్వరలోనే క్లౌడ్ హబ్ పాలసీని తీసుకురాబోతున్నామని, పెద్దయెత్తున మౌలిక సదుపాయల కల్పన చేపడతామన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రం శరవేగంగా దూసుకెళ్తొందన్నారు. ఈ రంగంలో రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే పాలనలో సాంతికతను వినియోగించడంలో ఏపీ ముందుందని తెలిపారు.













