Chandrababu:అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఎన్డీయే లక్ష్యం : సీఎం చంద్రబాబు

రాయలసీమను రతనాలసీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. కుప్పం నియోజకవర్గం (Kuppam constituency ) లోని పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. 2014-2019 మధ్య కాలంలో రాయలసీమ ప్రాజెక్టు (Rayalaseema project ) కోసం రూ.12,500 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. వైసీపీ పాలనలో కేవలం రూ.2 వేల కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. గేట్లతో సెట్టింగ్‌లు వేసి నీళ్లు కూడా బయటి నుంచి తీసుకొచ్చి నాటకాలాడిన ఘటనలు చూశాం. విమానం ఎక్కేలోపే నీళ్లన్నీ ఇంకిపోయిన పరిస్థితులు చూశాం. అసత్యాలు చెప్పడంలో వైసీపీ (YSRCP) దిట్ట. అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఎన్డీయే (NDA) లక్ష్యం. నీళ్లు వచ్చేసరికి వైసీపీ నేతలు జీర్ణించుకోలేపోతున్నారు.
ప్రతి చెరువుకు నీళ్లిచే బాధ్యత నాది. మల్యాలలో ప్రారంభించి కుప్పం పరమసముద్రానికి నీళ్లు తీసుకొచ్చాం. 27 లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎక్కడికక్కడ నీళ్లు తరలిస్తున్నాం. కుప్పానికి రెండేళ్ల కంటే ముందు కృష్ణా పుష్కరాలు వచ్చాయి. గతంలో రాయలసీమలో కరవు వస్తే, పశువుల కోసం రైలులో నీళ్లు తెప్పించి కాపాడుకున్నాం. నేను ఏ పని చేయాలన్నా వెంకన్నపై భారం వేసి బుల్లెట్‌లా దూసుకెళ్తా. పవిత్రమైన సంకల్పం ఉంటే ఏ పనైనా జయప్రదమవుతుంది. పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో 110 చెరువలకు నీళ్లిచ్చే అవకాశం ఉంది. కుప్పంలో 520 చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టు చెరువులు ఉన్నాయి. చెక్‌డ్యామ్‌ల ద్వారా నీళ్లిచ్చే అవకాశం ఉంది.కృష్ణా జలాలను 730 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఘనత టీడీపీది. మూఠా రాజకీయాలు లేకుండా చేసిన పార్టీ టీడీపీ (TDP). హంద్రీనీవా ఫేజ్-1, ఫేజ్-2 వల్ల 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు అందుబాటులో ఉంటుంది. పరిశ్రమలకు కూడా నీళ్లొస్తాయి. ఇప్పుడు కుప్పానికి నీళ్లొచ్చాయి. రాబోయే ఏడాదికి హంద్రీనీవా ద్వారా చిత్తూరుకు కూడా నీళ్లిచే బాధ్యత నాది అని అన్నారు.