TDP Governor : టీడీపీ నేతకు గవర్నర్ పదవి రాబోతోందా..?
కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే (NDA) ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ (BJP) నేతృత్వంలోని ప్రభుత్వంలో టీడీపీ (TDP) భాగస్వామిగా ఉంది. అలాగే రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని సర్కార్ లో బీజేపీ పాలుపంచుకుంటోంది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పైగా గతంలో లాగా రెండు పార్టీల మధ్య గ్యాప్ కూడా లేదు. గతంలో ఒక పార్టీ అవసరం మరో పార్టీకి లేకపోవడంతో ఎవరికి వారే అన్నట్టు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో మోదీ (PM Modi) సర్కార్ మనుగడ సాగించాలంటే కచ్చితంగా టీడీపీ అవసరం ఏర్పడింది. అలాగని టీడీపీ కూడా గతంలో లాగా గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. దీంతో బీజేపీ కూడా టీడీపీతో మంచి సంబంధాలు కోరుకుంటోంది.
ఎన్డీయేలో కీలక భాగస్వామి అయిన టీడీపీకి ఓ గవర్నర్ (Governor) పదవి ఇచ్చేందుకు బీజేపీ సముఖంగా ఉన్నట్టు వార్తలందుతున్నాయి. ఈ మేరకు టీడీపీ హైకమాండ్ కు బీజేపీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ మంచి నేత పేరును సూచిస్తే త్వరలోనే గవర్నర్ గా నియమిస్తామని చెప్పినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీంతో టీడీపీ సరైన నేతకోసం అన్వేషణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. గవర్నర్ పదవికి అన్ని అర్హతలు ఉన్న నేతల జాబితాలో కేంద్ర మాజీ మంత్రి అశోక గజపతి రాజు (Ashok Gajapathi Raju) పేరు ముందుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆయనకే గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉంది. దశాబ్దాలపాటు ఆయన టీడీపీకి సేవలందించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా పని చేశారు. వివాద రహితుడిగా పేరొందారు. దీంతో ఆయనకే గవర్నర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్టు సమాచారం.
అయితే ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ వర్గాలయితే బాగుంటుందని బీజేపీ సూచించినట్లు ఒక ప్రచారం జరుగుతోంది. అశోక గజపతి రాజు ఓసీ. ఒకవేళ ఆయన్ను కాదనుకుంటే మాత్రం బీసీ, ఎస్సీ వర్గాలకు ఆ అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. అదే జరిగితే యనమల రామకృష్ణుడి (Yanamala Ramakrishnudu) పేరు పరిశీలించే ఛాన్స్ ఉంది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. స్పీకర్ గా, మంత్రిగా పనిచేశారు. పార్టీ వాయిస్ ను బలంగా వినిపించగల నేత. వివాదరహితుడిగా పేరొందారు. కాబట్టి ఒకవేళ అశోక గజపతి రాజుకు ఆ అవకాశం దక్కకపోతే కచ్చితంగా ఆ పదవి యనమల రామకృష్ణుడిని వరించే ఛాన్స్ ఉంది.
ఇక మూడో వ్యక్తిగా వర్ల రామయ్య (Varla Ramaiah) పేరు కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్య పార్టీ వాయిస్ ను గట్టిగా వినిపిస్తున్నారు. గతంలో గెలవనని తెలిసీ కూడా పార్టీ ఆదేశాల మేరకు రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల వర్ల రామయ్య కుమారుడు వర్ల కుమార్ రాజా ఎమ్మెల్యేగా గెలిచారు. వర్ల రామయ్యను రాజ్యసభకు పంపిస్తారనే టాక్ నడుస్తోంది. ఇటీవల ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాల్లో ఒకదాన్ని వర్ల రామయ్యకు ఇస్తారని సమాచారం. ఒకవేళ రాజ్యసభకు వర్ల రామయ్యను పంపితే గవర్నర్ అవకాశం లేనట్టే. రాజ్యసభకు పంపకపోతే మాత్రం వర్ల రామయ్య పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇప్పటికే కంభంపాటి రామ్మోహన్ రావు (Kambhampati Rammohan Rao), బండారు దత్తాత్రేయ (Bhandaru Dattatreya) గవర్నర్ పదవుల్లో ఉన్నారు. మరో తెలుగు వ్యక్తికి కూడా త్వరలోనే గవర్నర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది.













