ఏపీ బిజెపిలో తప్పు అంతా సోముదేనా…?
ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడటం ఏమో గాని కొన్ని కొన్ని సమస్యలు మాత్రం ఇప్పుడు ఆ పార్టీలో తీవ్రంగా ఉన్నాయి. కొంతమంది నేతల మధ్య సమన్వయం లేకపోవడం మరికొంతమంది నేతల మధ్య విభేదాలు ఉండడం అలాగే మరికొంతమంది నేతలు కార్యకర్తలకు అందుబాటులో ఉండకుండా సొంత రాజకీయ ఎక్కువగా చేయడం వంటివి ఆంధ్రప్రదేశ్ బిజెపి లో ఎక్కువగా జరుగుతున్నాయి. దీని కారణంగా రోజురోజుకీ సమస్యలు తీవ్రమవుతున్నాయి అనే భావన బీజేపీ అధిష్టానం కూడా వ్యక్తం చేస్తుంది.
ఒక పక్క తెలంగాణలో బీజేపీ నేతలు అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తున్న సరే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అలాంటి పరిస్థితి కనపడటం లేదు. దీంతో ఇప్పుడు కొన్ని మార్పులు చేయడానికి కూడా బీజేపీ నేతలు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుని పక్కన పెట్టే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉండే కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి సోము వీర్రాజు కి బిజెపి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను ఆ పార్టీ అప్పగించింది.
కన్నా లక్ష్మీనారాయణ అదే సామాజిక వర్గానికి చెందిన నేత అయినా ఆయన సమర్థవంతంగా పనిచేయకపోవడంతో సోము వీర్రాజు మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ముందుకు వెళ్ళింది. సోము వీర్రాజు అధ్యక్షుడు అయిన కొత్తలో కొంతమంది కాపు సామాజిక వర్గం నేతలను కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలను కూడా ఆయన పార్టీలోకి తీసుకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత సోము వీర్రాజు సైలెంట్ అయిపోయారు.
ఇక అధికార పార్టీకి ఆయన అన్ని విధాలుగా సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఎక్కువగా వినపడుతున్నాయి. అసలు మీడియా సమావేశంలో మాట్లాడే విషయంలో కూడా సోము వీర్రాజు అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత సోము వీర్రాజు జనసేన పార్టీ నేతలను కలుపుకుని వెళ్లకుండా రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి. ముసిపాల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్న సరే… ఆ పార్టీకి బలం ఎక్కువగా ఉన్నా సరే దానిని భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మార్చుకునే విషయంలో విఫలమైంది బిజెపి నాయకత్వం. ఈ విషయంలో సోము వీర్రాజు లోపాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఆయనను పక్కన పెట్టే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందని సమాచారం. మీడియా సమావేశంలో కనబడే కొంతమంది బీజేపీ నేతలు సోము వీర్రాజు తో సన్నిహితంగా ఉండే వాళ్ళు కావడం గమనార్హం.













