టీడీపీ – జనసేన పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేయబోతున్నామని టీడీపీ, జనసేన ప్రకటించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటున చీలనివ్వబోమని, జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేయబోతున్నామని రెండు పార్టీల నేతలు స్పష్టం చేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఆ రెండు పార్టీల మధ్య పొత్తును విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలు జోరందుకున్నాయి. జగన్ కు మేలు చేసేందుకే బీజేపీ నేతలు ఈ స్కెచ్ వేశారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎలాగైనా జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే పట్టుదలతో పని చేస్తున్నాయి టీడీపీ, జనసేన. ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా పట్టంచుకోకుండా ఆ రెండు పార్టీలూ కలిసి ముందుకు సాగుతున్నాయి. రాష్ట్రస్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిల్లో కూడా ఆ రెండు పార్టీ నేతల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేసుకున్నాయి. ప్రతి కార్యక్రమంలో రెండు పార్టీలూ పాల్గొంటుండడంతో ఉత్సాహం కనిపిస్తోంది. ఇదే ట్రెండ్ ఎన్నికల వరకూ కొనసాగితే వైసీపీని ఓడించడం ఖాయమని నమ్ముతున్నాయి.
ఏపీలో టీడీపీతో కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న జనసేన.. తెలంగాణలో మాత్రం బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది. జనసేనతో సీట్ల సర్దుబాటు కోసం బీజేపీ వెంపర్లాడుతోంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీతో పోల్చితే జనసేన ప్రభావం సున్నా. అయినా పవన్ కల్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేనను కేర్ చేయని బీజేపీ.. ఇప్పుడు మాత్రం ఆ పార్టీతో పని చేసేందుకు ఉత్సాహం చూపిస్తోంది. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీలో ఒకలా, తెలంగాణలో మరోలా వ్యవహరిస్తోంది.
ఏపీలో బీజేపీని పక్కన పెట్టిన జనసేన.. తెలంగాణలో మాత్రం బీజేపీ హైకమాండ్ సూచన మేరకు కలిసి పని చేసేందుకు దాదాపు అంగీకరించింది. సెటిలర్ల ఓట్లను సొమ్ము చేసుకునేందుకే ఇలా చేస్తోందనే ఆరోపణలున్నాయి. అయితే ఇది ఓవరాల్ గా జగన్ కు మేలు చేస్తుందని టీడీపీ అనుమానిస్తోంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా జనసేన విమర్శలకు తావిస్తుంది. దీన్ని హైలైట్ చేసి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. ఈ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చేందుకు జనసేన దగ్గర ఆయుధాల్లేవు. మరి బీజేపీ ట్రాప్ లో పడిన పవన్ కల్యాణ్ దీన్ని ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి.













