AP Liquor Scam: జగన్, భారతి రెడ్డి చుట్టూ సిట్ ఉచ్చు బిగిస్తోందా..?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న లిక్కర్ స్కాం (Liquor Scam) కేసు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఈ కేసులో దూకుడు పెంచి, ఇప్పటికే పలువురు కీలక వ్యక్తులను అరెస్టు చేసింది. సిట్ రిమాండ్ రిపోర్టుల్లో వెలుగులోకి వస్తున్న కొత్త వివరాలు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) మరియు ఆయన భార్య భారతి రెడ్డి (YS Bharathi Reddy) పేర్ల చుట్టూ తీవ్ర చర్చను రేకెత్తిస్తున్నాయి. ఈ కేసులో అంతిమ లబ్దిదారు ఎవరు, బిగ్ బాస్ ఎవరు అనే ప్రశ్నలు రాష్ట్ర ప్రజలను ఆలోచనలో పడేస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం 2019-2024 మధ్య అమలు చేసిన మద్యం విధానంపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ విధానం ద్వారా నాణ్యత లేని మద్యాన్ని అధిక ధరలకు విక్రయించినట్లు, ఊరు పేరు లేని బ్రాండ్లను ప్రజలకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రక్రియలో నెలకు రూ.100 కోట్ల వరకు అక్రమ లాభాలు ఆర్జించినట్లు అంచనా. ఈ కుంభకోణంలో ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy), ఏపీ బేవరేజీస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి (Vasudeva Reddy) వంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.
సిట్ ఈ కేసులో విచారణను తీవ్రతరం చేసింది. రాజ్ కసిరెడ్డిని విచారించిన సిట్, అతడి సమాచారం ఆధారంగా మరికొందరికి నోటీసులు జారీ చేయాలని భావిస్తోంది. రాజ్ కసిరెడ్డి సమీప బంధువు చాణక్యను (Chanakya) కూడా సిట్ అరెస్ట్ చేసింది. వీళ్లద్దరి రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలను సిట్ పేర్కొంది. భారతి రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ (Balaji) పేరు తెరపైకి వచ్చింది. బాలాజీ, చాణక్య ద్వారా నిధులు జగన్, భారతి రెడ్డికి చేరినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సిట్ రిమాండ్ రిపోర్టుల్లో జగన్, భారతి రెడ్డి పేర్లపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే, సోషల్ మీడియాలో, కొన్ని ప్రధాన పత్రికల్లో భారతి రెడ్డి పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. జగన్ సన్నిహితులైన కొందరు నేతలు, ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు ఈ కేసులో సిట్ రాడార్‌లో ఉన్నారు. ఈ కేసులో జగన్, భారతి రెడ్డి పేర్లను సిట్ అధికారికంగా చేరుస్తుందా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ వాళ్లిద్దరి పేర్లను ఈ కేసులో చేర్చితే రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం ఖాయం.