లాజిక్ మిస్ అయిన ఐపీఎస్లు..!! కాదంబరి ఇష్యూలో అడ్డంగా బుక్..??
సినీ నటి, మోడల్ కాదంబరి జెత్వానీ వ్వవహారం కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ లో చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈమెను వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే దీని వెనుక కొంతమంది పెద్దలు, అధికారుల హస్తం ఉందని సమాచారం రావడంతో కేసు మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడు ఈ కేసు విచారణలో పలు కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. దీంతో కొందరు ఐపీఎస్ లతో పాటు అప్పటి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొంతమంది నేతలకు కూడా ఇబ్బందులు తప్పవేమోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 2 ఉదయం 6.30 గంటలకు సినీ నటి కాదంబరి జెత్వానితో పాటు ఆమె కుటుంబసభ్యులపై వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు పెట్టారు. తన స్థలాన్ని అక్రమంగా మరొకరికి ఆమె అమ్మేందుకు ప్రయత్నిస్తోందనేది ఆ ఫిర్యాదు సారాంశం. దీనిపై పోలీసులు ఆగమేఘాలపై స్పందించారు. అదే రోజు ఉదయం 11.30 గంటలకు ఫ్లయిట్ లో డీసీపీ విశాల్ గున్ని, అదనపు డీసీపీ రమణమూర్తితో కూడిన ఓ టీమ్ ముంబై వెళ్లి కాదంబరితో పాటు వాళ్ల ఫ్యామిలీ మొత్తాన్ని విజయవాడ తీసుకొచ్చింది. ఇంతవరకూ బాగానే ఉంది.
అయితే కుక్కల విద్యాసాగర్ ఫిబ్రవరి 2న కేసు పెడితే.. ఈ పోలీసు అధికారులు ముంబై వెళ్లడానికి ఫిబ్రవరి 1వ తేదీనే టికెట్లు బుక్ చేశారు. ఇక్కడే పోలీస్ అధికారులు లాజిక్ మిస్ అయ్యారు. అంటే కేసు అందుతుందని.. వెంటనే ముంబై వెళ్లాలని గ్రహించి టికెట్లు ముందే బుక్ చేశారా.. అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీన్ని బట్టి ఈ కేసులో కుట్రకోణం ఉందని దీనిపై దర్యాప్తు చేపడుతున్న స్రవంతి రాయ్ ప్రభుత్వానికి నివేదించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కుట్రకోణం ఉందని.., తనను వేధించారని.. తనకు న్యాయం చేయాలని కోరుతూ కాదంబరి జెత్వానీ ఏపీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్రవంతి రాయ్ నేతృత్వంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
స్రవంతి రాయ్ విచారణలో ఇలాంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్లయిట్ టికెట్లను ముందే బుక్ చేయడంతో పాటు ఫ్లాట్ అమ్మేందుకు ప్రయత్నించిందని చూపించిన స్టాంప్ పేపర్ కూడా 2018లోనే రాసినట్లు సృష్టించారు. దీని వెనుక వైసీపీకి సేవలందిస్తున్న ఓ లాయర్ హస్తమున్నట్టు విచారణలో తేలింది. ఈ కేసు తమ మెడకు చుట్టుకుంటోందని భావించిన కొందరు పోలీసులు అప్రూవర్లుగా మారిపోయి పూసగుచ్చినట్లు చెప్పేశారు. నాటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాతా ఈ బృందానికి నేతృత్వం వహించారని.. ఆయన చెప్పినట్లు విశాల్ గున్ని, రమణమూర్తి నడుచుకున్నారని వాళ్లు చెప్పేశారు. అయితే ఈ కేసు నమోదు నుంచి చివరి వరకూ పీఎస్ఆర్ ఆంజనేయులు కీలక పాత్ర పోషించారని వెల్లడించారు. ఆయనకు కొంతమంది ముఖ్యనేతలు ఎప్పటికప్పుడు గైడ్ చేసేవారని.. దానికి అనుగుణంగానే కేసు నడిచిందని పోలీసులు వివరించారు. దీంతో ఐపీఎస్ లపై యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.













