Yoga Day: 2.30 కోట్ల మందితో యోగా..విశాఖలో చరిత్ర సృష్టించనున్న ఏపీ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మరోసారి అరుదైన రికార్డ్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం చేసుకున్నారు. విభజన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో స్థానం సంపాదించారు. పాలనలో ఎన్నో వినూత్న మార్పులు తీసుకురావడంలో ముందు వరుసలో ఉండే చంద్రబాబు ఇప్పుడు యోగా ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు.
ఈ సంవత్సరం జూన్ 21న జరగబోయే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International Yoga Day) ప్రత్యేకంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖపట్నం (Visakhapatnam) లో నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. విశాఖలో 5 లక్షల మంది భాగస్వాములతో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.30 కోట్ల మంది ప్రజలు యోగా చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం.
ఈ భారీ యోగా ఉత్సవాన్ని ‘Yoga for One Earth – One Health’ అనే నినాదంతో నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా 108 నిమిషాల పాటు సూర్య నమస్కారాలు చేయనున్నారు. మొత్తం 1,29,000 ప్రాంతాల్లో యోగా శిబిరాలు ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యంగా గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయిలో ప్రతి వూళ్ళో యోగా నిర్వహణకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖలో నిర్వహించబోయే కార్యక్రమంలో 26 కిలోమీటర్ల పొడవున ప్రత్యేకంగా 326 యోగా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులతోపాటు మొత్తం 22 ప్రపంచ రికార్డులను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే అధికార యంత్రాంగం సమగ్ర ప్రణాళికతో పనిచేస్తోంది.
ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం, ప్రకృతిని కాపాడేందుకు యోగా ఎంత అవసరమో ప్రజలకు తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యంగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలతో రాష్ట్రంలోని విద్యా సంస్థలు, సంక్షేమ గృహాలు, ప్రభుత్వ కార్యాలయాలు సైతం యోగా కార్యాక్రమాలలో భాగస్వామ్యం కావడానికి సిద్ధమవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా చంద్రబాబు నాయకత్వాన్ని మరోసారి చాటి చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే 2 కోట్ల మంది వరకు పేర్లు నమోదు చేయగా, ఆ సంఖ్య 2.30 కోట్లను దాటి పోయింది. రేపు (June 21) ఈ కార్యక్రమం జరిగే విధానం పై దేశమంతా ఆశక్తిగా ఎదురుచూస్తోంది.