తెలుగును మించిన భాష ప్రపంచంలోనే లేదు : స్వరూపానందేంద్ర స్వామి
తెలుగు భాషను చంపే ప్రయత్నం ఇటీవల జరుగుతోందని, ఇది సబబు కాదని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంరద సరస్వతి స్వామి పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపాన పెద్దఅమిరంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగును మించిన భాష ప్రపంచంలోనే లేదని ఆయన పేర్కొన్నారు. తెలుగును ఏ తరమైనా చంపేద్దామనుకుంటటే దాన్ని పరిరక్షించేందుకు మరో తరం ఉవ్వెత్తున పుట్టుకొస్తుంది. పిల్లలను ఇంట్లో తెలుగులోనే మాట్లాడమనండి. హైదరాబాద్లో ఉన్న శిల్పారామానికి మించి తెలుగు సంస్కృతి ప్రతిబింబించే వేదికను ఏపీలోనూ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తా అని అన్నారు. సంబరాల్లో పాల్గొన్న మంత్రి శ్రీరంగ నాథరాజు మాట్లాడుతూ స్వరూపానందేంద్ర ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని పాలిస్తున్నారని అన్నారు. అనంతరం శాసనసభ ఉపసభాపతి కోన రఘుపతి అంతర్జాతీయంగా ఉన్న భాషాభిమానులను, సాహితీ సేవకులను ఓ చోటికి చేర్చి నిర్వాహకులను అభినందిస్తున్నట్లు తెలిపారు.













