అంగరంగ వైభవంగా జరిగిన తెలుగు సంబరాలు
భీమవరంలో ఆంధ్రసారస్వత పరిషత్ వేడుకలు.. ప్రముఖుల ప్రసంగాలు
‘ఆంధ్ర సారస్వత పరిషత్ (భీమవరం)’ ఆధ్వర్యంలో భీమవరం వేదికగా జనవరి 6 వ తేదీ నుంచి 8వ తేదీ వరకూ జరిగిన ‘అంతర్జాతీయ తెలుగు సంబరాలు’ వైభవంగా జరిగాయి. ఆంధ్ర సారస్వత వికాసానికి ప్రతీకగా నిలిచే రంగాలన్నింటినీ రంగరిస్తూ ఈ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించి తెలుగు భాషా సాంస్కృతిక ప్రేమికులందరికీ మహదానందాన్ని కలిగించారు. ఈ సంబరాలు నిర్వహించిన ప్రాంగణానికి ‘కవిత్రయ వేదిక’ అని పేరు పెట్టడం అందరినీ ఎంతో ఆకట్టుకుంది. ఈ వేడుకల్లో భాగంగా జనవరి 3న భీమవరంలో తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహించారు. జనవరి 6న ప్రాచీన కవులు, రాజవంశీయుల కుటుంబీకులకు ఆంధ్ర పూర్ణకుంభ పురస్కారాలు ప్రదానం చేశారు. మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, స్వరూపానందేంద్ర సరస్వతి తదితరులతోపాటు రాష్ట్ర మంత్రులు, సినీ నటులు, వివిధ రంగాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సంబరాలకు ముందు శోభాయాత్ర నిర్వహించారు. జనవరి 3న నిర్వహించిన తెలుగు వైభవ శోభా యాత్ర ఆకట్టుకుంది. విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానంద స్వామి వారి చేతుల మీదుగా శోభా యాత్రను ప్రారంభమైంది. తెలుగు సాహిత్య ప్రక్రియల 20 శకలాలను ఆకర్షణీయమైన సమచారంతో అలంకరించి, తప్పేటగుళ్ళు, కోలాటం, సంచార జాతుల కళా రూపాల ప్రదర్శనలతో భీమవరం పురవీధులలో ఈ శోభాయాత్ర సాగింది.
విభజనతో రెండుగా చీలిన ఆంధ్రసారస్వత పరిషత్
తెలుగు రాష్ట్రాల విభజనముందు పుట్టిన ఆంధ్రసారస్వత పరిషత్తుకు 6 దశాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. ఎందరో మహానుభావులు తెలుగుభాషా వికాసం కోసం ఈ పరిషత్‌కు అంకురార్పణ చేసి, దానిని సమున్నతమైన సంస్థగా తీర్చిదిద్దారు. నాటి హైదరాబాదు సంస్థానంలో నిజాం ఏలుబడిలో తెలుగుజాతి అన్ని విధాలా దారుణ పరిస్థితులు ఎదుర్కుంటున్న తరుణంలో ఆంధ్ర భాషా సంస్కృతుల పరిరక్షణకు, ప్రచారానికి ఒక ప్రత్యేక సంస్థ ఉండాలని నాటి తెలుగు భాషా ప్రేమికులు భావించారు. దాని కారణంగా 26 మే 1943 వ తేదీన హైదరాబాదు నగరంలో కీర్తిశేషులు లోకనంది శంకర నారాయణరావుగారి అధ్యక్షతన ఆంధ భాషాభిమానుల, కవి పండితుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తెలుగు భాషను, సంస్కృతిని ప్రచారం చేయడమే ప్రధాన లక్ష్యంగా ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు’ ఏర్పడింది.
మాడపాటి హనుమంతరావు, బుక్కపట్టణం రామానుజాచారి, సురవరం ప్రతావరెడ్డి, లోకనంది శంకరనారాయణరావు, బూర్గుల రామకృష్ణారావు, చిదిరెకుఠం వీరభద్రశర్మ, ఆదిరాజు వీరభద్రరావు, పంతులు, నందగిరి వెంకటరావు, కోదాటి నారాయణరావు, గడియారం రామకృష్ణశర్మ, భాస్కరభట్ల కృష్ణారావు గార్లతో ఒక ఉపసంఘం ఏర్పాటై సంస్థకు సంబంధించిన నియమావళిని, ప్రణాళికను సిద్ధం చేసింది. నిజాం రాష్ట్రంలో మాతృభాషాభిమానాన్ని పెంపొందించి, తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తూ సాహిత్య సంస్థలను, సారస్వతోపాసకులను ప్రోత్సహిస్తూ, సారస్వత సాంఘిక విషయాలపై (గ్రంథాలను ప్రకటించాలన్న ఆశయాలతో నియమావళి రూసౌందింది. 1.6.43 నాడు జరిగిన ప్రథమ మహాసభలో తొలి కార్యవర్గం ఏర్పడిరది: మొదటి సంవత్సరంలోనే వరంగల్లు, ఖమ్మం, జనగామ, మహబూబాబాదు, ఆలంపూరు, తోటపల్లి మొదలైన ప్రాంతాల్లో శాఖ లేర్పడినవి, క్రమంగా సారస్వత పరిషత్తు హైదరాబాదు రాష్ట్రంలో సంకాంతి, ఉగాది సమావేశాలను, తెలుగు మహాకవుల జయంతులను, కవి సమ్మేళనాలను, నిర్వహించడం ప్రారంభించింది. పరిషత్తు ద్వితీయ మహాసభ 1944 డిసెంబరులో వరంగల్లులో జరిగింది. ఈ మహాసభల్లోనే పరిషత్తు కార్యక్రమాల మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆంధ్ర సంస్కృతి సారస్వతాల సర్వతోముఖ వికాసానికి కృషి చేయడం. ప్రజలలో నిరక్షరాస్యతను నిర్మూలించి మాతృభాష ద్వారా విద్యావ్యాప్తి గావించడం వంటివి చేయాలని అనుకున్నారు.
అలాగే సభలు, సమ్మేళనాలు జరపడం, ప్రాచీన సారస్వతాన్ని ప్రకటించడం, పారిభాషిక మాండలిక కోశాలను సిద్దం చేయడం, ఇతర సంస్థల తోడ్చాటుతో సాహత్యాభివృద్దికి కృషి చేయడం వంటివి చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్ ఎన్నో కార్యక్రమాలను చేపడుతూ వచ్చింది. ఎంతోమంది తెలుగు ప్రముఖులు సినారె వంటివారు దీనికి అధ్యక్షత వహించి కార్యక్రమాలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలను, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజించడంతో హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్ర సారస్వత పరిషత్‌ను తెలంగాణ సారస్వత పరిషత్గా మార్చారు. డా. గజల్ శ్రీనివాస్ ఈ సంఘాన్ని ఆంధ్రలో కూడా ఏర్పాటు చేయాలని భావించి భీమవరం వేదికగా ఆంధ్ర సారస్వత పరిషత్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో ప్రముఖులు
భీమవరంలోని పెదఅమిరం గ్రామంలో తెలుగుభాష వైభవాన్ని చాటుతూ జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాలను తొలుత మిజోరం గవర్నర్ హరిబాబు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషతో పాటు ఇతర భాషలూ నేర్చుకోవాలన్నారు. అనేక భాషలు నేర్చుకోవడం వల్ల మనిషి వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుందన్నారు. తెలుగు భాష అంటే తనకు చాలా ఇష్టమన్నారు.
సినీ నటుడు సాయికుమార్ మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటేందుకు అంతర్జాతీయ తెలుగు సంబరాలు ఇక్కడ నిర్వహించడం అభినందనీయమన్నారు. భారతంలో కుంతీదేవి – కర్ణుడు అద్భుతమైన సన్నివేశ ఘట్టాన్ని పదునైన డైలాగులతో ఆయన పలికి అందరినీ అలరించారు. అమ్మ, నాన్న మాటలు వినండి, గురువులను గౌరవించాలని విద్యార్థులనుద్దేశించి ఉద్బోధించారు.
హోసూరు మాజీ ఎమ్మెల్యే పి.గోపీనాథ్ తదితరులు కూడా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం తెలుగు వెలుగుల పేరుతో సినీనటుడు సాయికుమార్‌ను, పలువురు కళాకారులను సత్కరించారు.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న మాట్లాడుతూ తెలుగు భాషలో జీవన మూలాలు ఉంటాయని, వాటిని కాపాడుకోవడమంటే బతుకు కోరుకోవడమన్నారు. భాషను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం గొప్ప పోరాటం వంటిదన్నారు.
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ నేను తెలుగువాడిని అంటూ ఎన్టీయార్ బల్లగుద్ది చెప్పేవారన్నారు. ట్యాంకుబండ్‌పై ఎన్టీఆర్ ఏర్పాటుచేసిన విగ్రహాలపై ఒక దశలో విమర్శలు చేశారని, ఆ విగ్రహాలు ఏర్పాటు చేయకపోతే తెలుగు వాడికి చిరునామా లేదని అన్నారు. ఆ మహానుభావుడు (ఎన్టీయార్)కి తెలుగు విలువ తెలుసు కాబట్టే వాటిని ఏర్పాటు చేశారని చెప్పారు. భాష మనల్ని లక్ష్యంవైపు నడిపిస్తుందని అన్నారు.
హైకోర్టు జడ్జి ఆకుల వెంకట శేషసాయి మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడితే కొన్ని వందల జబ్బులు నయమవుతాయని చెప్పారు. ఏ జాతి అయితే భాష, సంస్కృతిని మరిచిపోతుందో ఆ జాతి చరిత్రలో అంతరించిపోతుందని గాంధీజీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. అమ్మను, అమ్మ భాషను గౌరవించలేని వాడు సమాజంలో పనికి రాడన్నారు.
తెలుగు అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ప్రభుత్వం తరుపున రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా తెలుగు సంబరాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమానికి గజల్ శ్రీనివాస్ అధ్యక్షత వహించగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఉండి ఎమ్మెల్యే రామరాజు తదితర ప్రముఖులు పాల్గొన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలిసేలా సభలను నిర్వహించడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకునేందుకు సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగు సంస్కృతి వైభవాన్ని సంక్రాంతి సంబరాల మేళవింపుగా సభలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. తెలుగు భాష పరిరక్షణకు ఈ మండలంలో అనేక సంబరాలు, కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తిరుపతి వెంకట కవులశాస్త్రి, దివాకర్ల వెంకటావధానులు, తనికెళ్ల భరణి కూడా ఇక్కడే పుట్టారన్నారు.
డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడేందుకు ఇలాంటి సంబరాలు నిర్వహించడం శుభదాయకమన్నారు. తెలుగు భాషను కాపాడుకుందామన్నారు. తెలుగు భాషను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.
స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకోసం హైదరాబాద్‌లోని శిల్పారామానికి తగ్గట్టుగా ఈ రాష్ట్రంలో శిల్పారామం ఏర్పాటు చేయాలని సిఎం జగన్ మోహన్‌రెడ్డిని కోరతామన్నారు.
తెలుగు ప్రముఖులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో తెలుగు సాహిత్యాన్ని కాపాడేందుకు గతంలో పరిషత్ ఏర్పాటు చేసి సంబరాలు నిర్వహించారన్నారు. అయితే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన అనంతరం భీమవరంలో పరిషత్తును స్థాపించేందుకు గజల్ శ్రీనివాస్ విశేష కృషి చేసి ఏర్పాటు చేశారన్నారు. తెలుగు సాహిత్యాన్ని ఘనంగా చెప్పిన ఎందరో మహనీయులు వారసులను గుర్తించి వారందరికీ తెలుగు సాంప్రదాయ బద్దంగా పూర్ణ కుంభాలతో సత్కరించడం అభినందనీయమన్నారు.125 భాషల్లో గజల్స్ వినిపించిన శ్రీనివాస్ అన్ని భాషలకు ప్రాధాన్యత ఇస్తారని కానీ తెలుగు భాష మహోన్నతను కాపాడేందుకు తెలుగు భాష యొక్క ఘనతను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేందుకు శ్రీనివాస్ చేస్తున్న భగీరథ ప్రయత్నాలకి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి అధ్యక్షులు కొయ్యే మోషేన్‌రాజు, క్షత్రియ కార్పోరేషన్ అధ్యక్షులు పాతపాటి సర్రాజు, ఏపీ సైబర్ నెట్ కార్పొరేషన్ అధ్యక్షులు పి.గౌతంరెడ్డి, ఎమ్మెల్యేలు మంతెన రామరాజు, గ్రంధి శ్రీనివాస్, డిసిసిబి చైర్మన్ పి.వి.ఎల్.నరసింహ రాజు, ఆంధ్ర సరస్వత్తు పరిషత్తు ప్రధాన కార్యదర్శి రాయప్రోలు భగవాన్ తదితరులు పాల్గొన్నారు.
వివిధ దేశాల.. వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధుల హాజరు
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దుబాయ్, షార్జా, అబుదాబి, బహెరైన్, ఖతార్, డెన్మార్క్, ఇండోనేషియా, జర్మనీ, ఐర్లాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఆఫ్రికా, టాంజినియా, ఉగాండా, కెన్యా, ఫిలిఫైన్స్, జపాన్ నుండి తెలుగు సంఘాల ప్రతినిధులు వచ్చారు. అలాగే బెంగళూరు, మైసూర్, బళ్ళారి, హెస్పేటు హోనూర్, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్, బరంపురం, ఖరగపూర్, లక్నో, వారాణాషి, ముంబై, పుణే, నాసిక్, త్రివేండ్రమ్, కొచ్చిన్, మంగళూరు, చండీగఢ్, ఢల్లీి హర్యానా, భోపాల్, డెహ్రాడూన్, ఇలా అనేక తెలుగు సంఘాల ప్రతినిధులు తెలుగు రాష్ట్రేతర సంఘాల సమాఖ్య సమన్వయంతో హాజరయ్యారు.
పూర్ణకుంభ పురస్కారాలతో సత్కారం
భీమవరంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో భాగంగా పలువురు ప్రముఖులను పూర్ణకుంభ పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. దేశం నలుమాలల నుంచి ఈ అవార్డులు అందుకున్న వారు ఉన్నారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారి వారసులకు ఈ అవార్డులు అందజేయడం జరిగింది. తెలుగు భాషకు పూర్తి స్థాయిలో ఉత్తమ సేవలందించిన తెలుగు భాషను బతికించిన వారసులకు ఈ అవార్డులు అందజేశారు. దేశం నలుమూలల నుంచి వివిధ భాషలలో తెలుగు భాషపై ఎక్కువ ప్రామాణికంగా రచనలు గ్రంధాలు వ్రాసిన వారు వారసులు ఈ అవార్డు తీసుకున్న వారిలో ఉన్నారు. మాచరవం శర్మ విశ్వనాథ సత్యనారాయణ తాడికొండ బాపిరాజు, గురజాడ వెంకటేశ్వర ప్రసాద్, గిడుగు వెంకట నాగేశ్వరరావు, స్నేహలత మురళి, షణ్ముఖ విజయ కుమార్, రాజు షేక్ బాపూజీ శ్రీ భాస్కర్ ఎర్రాగ్రడ, పద్మనాభరావు, కావూరి శ్రీనివాస శర్శ, తాళ్ళపాక హరినారాయణ చార్యులు, కంచర్ల శ్రీనివాస్, శివ ప్రసాద్, ఆదిభట్ట సూర్యనారాయణ , శ్రీమతి రాధాకుమారి, వెంపరాల సుజయ్ రంగారావు, కొచ్చర్ల కోట వీరభద్రరావు, రాజారావు, వెంకట మహివతి రాము తర్న రావు, గురజాడ శ్రీకాంత్, రాజా కలిదిండి కుమార్ గోపాల కృష్ణ, కృష్ణంరాజు బహదూర్ తదితరులు అవార్డు అందుకున్న వారిలో ఉన్నారు. అమెరికాలో తెలుగు పత్రికను నడుపుతున్న తెలుగుటైమ్స్ ఎడిటర్ చెన్నూరి వెంకట సుబ్బారావును కూడా ఈ వేడుకల్లో పూర్ణకుంభంతో సత్కరించారు.
ఆకట్టుకున్న అష్టావధానం, ఇతర సదస్సులు
భీమవరం వెస్ట్ బెర్రీ హైస్కూల్ విద్యా ప్రాంగణం పెదఅమిరంలో జరుగుతున్న ఆంధ్ర సారస్వత పరిషత్తు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో శ్రీమతి బులుసు అపర్ణ అష్టావధాన కార్యక్రమం చాలా అత్యంత ఆసక్తికరంగా, ఛలోక్తులతో హాస్య సంభాషణలతో ఆనందకరంగా సాగింది. కడిమిళ్ల వరప్రసాద్ అధ్యక్షతన జరిగిన అష్టావధాన కార్యక్రమంలో కడిమిళ్ల మీనాక్షి, పృచ్ఛకులు శ్రీమతి బులుసు అపర్ణకు తెలుగు మాట సమస్యను ఇవ్వగా, ఆమె వెలుగది జీవితాన అభివృద్ధికి మూలము మాతృభాషయే, కలలకు రూపకల్పనకు కామిత దాయిని కామ ధేనుమై, వెలవెల బోవనియక విజ్ఞత కల్గియ చూచి భ్రష్టమవు తెలుగున మాటలోడకము ధీన ముపేతులు మెచ్చ రేవ్వరున్ అంటూ సమస్యను పూరించారు. పూచిన పెద్ది సుబ్రహ్మణ్యం నిషిద్ధాక్షరి సభ ప్రాంగణం వద్ద ఉన్న బాల గూర్చి అడుగగా శ్రీమతి బులుసు అపర్ణ వారు (మీకై సాగే సభయే వాకుల్ కనముగ్దమై సభా స్థాయి గళల్ అవకాశమునందు కొనగ ప్రకారము దీప్తి మీరు బాలలు వినుడీ) ఈ విధంగా పృచ్ఛకులు సుబ్రహ్మణ్యం ఇచ్చినట్టు వంటి నిషిద్ధాక్షరి పూర్తి చేశారు. పృచ్ఛకులు అద్యక్షులు గరిమెళ్ల వరప్రసాద్, నిషిద్దాక్షరి పోచిన పెద్ది సుబ్రహ్మాణ్యం, సమస్య కడిమెళ్ళ మీనాక్షి, దత్తపది కేటి పద్మజ, వర్ణ ఎం బి డి శ్యామల, ఆశువు ఏ ధనలక్ష్మి ,అప్రస్తుత ప్రసంగం చక్రావధానుల రెడ్డిప్పధవేజి, వార గణితం బీసెట్టి జ్యోతి రాజు తదితరులు ఈ కార్యక్రమానికి వన్నె తీసుకువచ్చారు.
తెలుగు సాహిత్యంలో నవీన రీతులు
గజల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సంబరాలలో భాగంగా ‘తెలుగు సాహిత్యంలో నవీన రీతులు’ (ప్రక్రియలు) అనే సదస్సుకు ఖమ్మంజిల్లా నివాసి నవరత్నాల ప్రక్రియ రూపకర్త రాణాప్రతాప్ అధ్యక్షత వహించారు. జనరంజకంగా జరిగిన ఈ సదస్సులో విశాఖపట్టణ నివాసి, ఎలయన్స్ కళాశాల అధ్యాపకురాలు ఉమామహేశ్వరి యాళ్ళ, ఖమ్మం జిల్లా నివాసి, తెలుగు అధ్యాపకులు, టిపిటిఎఫ్ పత్రికా సంపాదకులు అయిన ఎనగందుల దేవయ గారు సృష్టించిన నూతన కవితా ప్రక్రియ షాడోలను చక్కగా ఉదహరించి సభకి పరిచయం చేసారు.
అహో అనిపించిన సాంస్కృతిక కార్యక్రమాలు
అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. కుమారి సంయుక్త ఆది నాయకుడైన వినాయకుని పాటను కూచిపూడి నృత్యం ద్వారా ప్రదర్శించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నెల్లూరుకు చెందిన సాయి హేమంత్ కృష్ణ నాసిక వేణుగానం ప్రదర్శించి ప్రేక్షకులను మైమరిపించారు. భీమవరం జెడ్పి రోడ్డు వద్ద గల ఆదిత్య ఈ ఎంఐ ఉన్నత పాఠశాల విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆరసద్శ పాఠశాల విద్యార్థులు తెలుగు భాష విశిష్టతను అభివర్ణిస్తూ తెలుగు తల్లి కూచిపూడి నృత్య ప్రదర్శన సభికులను కట్టిపడేసింది.
అష్టావధానం, పద్య కవితా సదస్సు, పద్యగానం, తెలుగు నాటక సాహిత్య సదస్సు, బుర్రకథ, బాల సాహిత్య సదస్సు, హరికథా గానం, ప్రదర్శనాత్మక కళల సదస్సు, ద్రౌపతి ఏకపాత్రాభినయం, కథ, కథానిక, నవల సదస్సు, చాణక్య ఏకపాత్రాభినయం, కూచిపూడి నృత్యం ప్రదర్శించారు. తొలుత విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన విష్ణుభట్ల కార్తీక్ ఆలపించిన తెలుగు పద్యగానం ఆహుతులను రంజింపజేసింది. తెలుగు సంబరాల సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కార్తీక్ తెలుగు పద్య పఠనం ఆలపించారు. దాదాపు 20 నిమిషాల పాటు గానం ఆలపించి అందరినీ ఆకట్టుకున్నాడు.
తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలి – మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు
మన మాతృభాష తెలుగు భాషకు ఉన్న ఔన్నత్యాన్ని అందరూ పరిరక్షించాలని మిజోరాం రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు అన్నారు. మండలంలోని భీమవరంలోని పెదఅమిరం గ్రామంలో తెలుగుభాష వైభవాన్ని చాటుతూ నిర్వహించిన అంతర్జాతీయ తెలుగు సంబరాలను హరిబాబు జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాతృభాషతో పాటు ఇతర భాషలూ నేర్చుకోవాలన్నారు. అనేక భాషలు నేర్చుకోవడం వల్ల మనిషి వ్యక్తిత్వం పరిపూర్ణం అవుతుందన్నారు. తెలుగు భాష అంటే తనకు చాలా ఇష్టమన్నారు. ప్రతిఒక్కరూ అన్ని భాషలనూ గౌరవించాలన్నారు. భీమవరం ప్రాంతంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
తెలుగుకు గుర్తింపు తెచ్చింది ఎన్టీఆరే – హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
తెలుగు జాతికి, తెలుగు భాషకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చింది నందమూరి తారక రామారావు మాత్రమేనని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. పూర్వం తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు ఆంధ్రా వాళ్లను మద్రాసీ అని పిలిచేవారు. ఎన్టీయార్ సీఎం అయిన తర్వాత మద్రాసీ కాదు ఆంధ్ర తెలుగు అని నిరూపించారు. చెయ్యెత్తి జ్కెకొట్టు తెలుగోడా.. అనే తెలుగు గేయం విన్నప్పుడల్లా నా మనసు పులకరిస్తుంది’ అని దత్తాత్రేయ చెప్పారు. అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో చివరి రోజ్కెన శనివారం ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ ప్రాంతం నిజాం పాలనలో ఉన్నప్పుడు ఉర్దూలో మాట్లాడాల్సి వచ్చేది. అప్పుడు ఆంధ్ర సారస్వత పరిషత్ పోరాడిరది. రాష్ట్రం విడిపోయాక గజల్ శ్రీనివాస్ ఆ వేదికగా తెలుగు సంబరాలు నిర్వహించడం గొప్ప కృషి’ అని దత్తాత్రేయ అన్నారు. సుమారు 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఏకైక భాష తెలుగేనని చెప్పారు. 2008 అక్టోబరు 31న సంస్కృతం, తమిళంతోపాటు తెలుగు భాషను ప్రాచీన భాషల సరసన చేర్చారని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు భాషాభివృద్ధికి కృషి చేయాలని చెప్పారు. తల్లి భాషను మరిచిపోతే మనకు అస్తిత్వం ఉండదన్నారు.
తెలుగు రేపటితరానికి అందించేలా చూడాలి – శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి
దేశభాషగా గుర్తింపు పొందిన తెలుగును రేపటితరాలకు అందించేందుకు పాలకులు దృష్టి సారించాలని విశాఖ శ్రీ శారదపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కోరారు. తెలుగు భాషను చంపే ప్రయత్నం ఇటీవల జరుగుతోందని, ఇది సబబు కాదని కూడా ఆయన పేర్కొన్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపాన పెద్దఅమిరంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగును మించిన భాష ప్రపంచంలోనే లేదని ఆయన పేర్కొన్నారు. తెలుగును ఏ తరమైనా చంపేద్దామనుకుంటటే దాన్ని పరిరక్షించేందుకు మరో తరం ఉవ్వెత్తున పుట్టుకొస్తుంది. పిల్లలను ఇంట్లో తెలుగులోనే మాట్లాడమనండి. హైదరాబాద్‌లో ఉన్న శిల్పారామానికి మించి తెలుగు సంస్కృతి ప్రతిబింబించే వేదికను ఏపీలోనూ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ రాస్తా అని అన్నారు. ప్రాంతాలవారీగా యాసలు మారినా తెలుగు భాష మాత్రం మారదని వెల్లడిరచారు. దేశంలో హిందీభాష తర్వాత అంతటి గుర్తింప పొదిన తెలుగు భాష పట్ల మక్కువ తగ్గి అంగ్ల భాషవైపు పాలకులు, ప్రజలు దృష్టి పెడుతున్నారని, అది సరైన పద్దతి కాదని వెల్లడిరచారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఏ ప్రాంతాకి వెళ్లినా, ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా తెలుగు భాషకు ఉన్న అభిమానం చెప్పలేనిదన్నారు. ప్రాంతాల వారీగా భాషలో యాసలు మారోచ్చుగాని తెలుగు భాష మాత్రం ఒక్కటి గానే ఉంటుందని తెలిపారు. అతిపెద్ద భాషలుగా చెప్పుకునే కన్నడం, తమిళం, మళయాలం, హిందీ భాషల్లో ఒకే యాస ఉంటుందని, అదే తెలుగు భాష మంత్రం ప్రాంతాలు మారినా, రాష్ట్రాలు మారినా యాసలో మార్పులు ఉంటాయే తప్ప భాషలో తేడా ఉండదని తెలిపారు.
అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో చెన్నూరి సుబ్బారావుకు ‘పూర్ణ కుంభ పురస్కారం’
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో భీమవరంలో జరిగిన అంతర్జాతీయ తెలుగు సంబరాల్లో అమెరికాలోని ఎన్నారై పత్రిక తెలుగుటైమ్స్కు ఎడిటర్‌గా ఉన్న చెన్నూరి వెంకట సుబ్బారావును పూర్ణకుంభ పురస్కారంతో సత్కరించారు. మిజోరం గవర్నర్ కంభంపాటి హరి బాబు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందించారు. తెలుగు భాష అభివృద్ధికి, పురోభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ‘పూర్ణ కుంభ పురస్కారం’ అంటూ గౌరవించారు.
తెలుగు భాషకి ఆది కవులు – నన్నయ, తిక్కన, ఎర్రన్న లు, తెలుగు కవులు శ్రీనాధుడు, అన్నమయ్య, రామ దాసుల వంశం వారిని, అదే విధంగా తెలుగు భాషను ప్రోత్సహించి, తెలుగు కవులను గుర్తించిన రాజులు, జమిందారుల వారసులను గుర్తించి, వారిని ఈ సభకు ఆహ్వానించి సత్కరించారు.
అమెరికాలో తెలుగు పత్రిక – తెలుగు టైమ్స్, పాఠశాలను ప్రారంభించి అక్కడ తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న కృషికి గాను ఈ పురస్కారాన్ని సుబ్బారావుకు అందించారు.
అందరి తోడ్పాటుతో తెలుగు సంబరాలు విజయవంతం – గజల్ శ్రీనివాస్
అంతర్జాతీయ తెలుగు సంబరాలు 2022 జనవరి 6,7,8 తేదీలలో కవిత్రయ వేదికపై ఘనంగా జరిగింది. ఆంధ్ర సారస్వతానికి చరిత్రలో ఎంతో కృషి చేసిన భీమవరంలో నిర్వహించాలన్న అందరి అభిప్రాయంతో ముందుకు సాగుతూ అన్ని విధాలా సౌకర్యాలు కలిగి వెస్ట్ బెర్రీ హై స్కూల్‌ను వేదికగా ఎంచుకుని ఈ ఉత్సవాలు చేశాము. ఎంతోమంది ప్రముఖులు మమ్మల్ని ఆశీర్వదిం చడంతో పాటు పలువురు ఈ ఉత్సవాలకు హాజరై తమ సందేశాన్ని వినిపించారు. అలాగే ప్రముఖ కళాకారులు, ఇతరులు ఈ వేడుకల్లో పాల్గొని కార్యక్రమానికి మరింత వన్నె తీసుకువచ్చారు. అందరికీ ధన్యవాదాలు. రాబోయే తరాలకు ఈ తెలుగు భాషను ప్రక్రియలను మహోన్నతం చేసి అందించాలన్న మా ఆశ ఈ సంబరాల విజయవంతంతో నెరవేరుతుందని ఆశిస్తున్నాము. తెలుగు భాషను కాపాడేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్తు నిరంతరం శ్రమిస్తోందని వెల్లడించారు. తెలుగును వెలిగించాలని, ఆంధ్ర వాంగ్మయం మరింతగా ఈ సంబరాలతో బలపడుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.













