Infosys: విశాఖలో ఇన్ఫోసిస్ క్యాంపస్!
సాంకేతిక రంగంలో అంతర్జాతీయ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) విశాఖ (Visakha)లో శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. దీని కోసం ఎండాడ (Endada) వద్ద 20 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఆ సంస్థ ప్రతినిధులతో అధికారులు జరిపిన సంప్రదింపులు కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. ఈ నెలలో దీనిపై అధికారిక ప్రకటన (Official announcement) వెలువడే అవకాశం ఉంది. ఇన్ఫోసిస్ క్యాంపస్‌కు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలపై తుది సంప్రదింపులు కూడా తుది దశకు వచ్చినట్లు సమాచారం. మౌలిక సదుపాయాలు కల్పించే విషయంలో సంస్థ చేసిన కొన్ని ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇన్ఫోసిస్, దాని అనుబంధ సంస్థలకు సుమారు 50 దేశాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏర్పాటుపై రెండు నెలల క్రితమే ఆ సంస్థతో ప్రభుత్వం సంప్రదింపులు ప్రారంభించింది. ప్రస్తుతం విశాఖ ఐటీ హిల్స్‌లో తాత్కాలిక భవనంలో ఇన్ఫోసిస్ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది.






