తిరుపతి నుంచి ఇండిగో సేవలు
మన దేశం విమానయాన రంగంలో మంచి అభివృద్ధి సాధిస్తోంది. ఏటా విమాన ప్రయాణికులు పెరుగుతున్నారు. ఈ విషయంలో మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. రేణిగుంట విమానాశ్రయాంలో ఇండిగో కొత్త సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఇండిగో ఇప్పటివరకు తిరుపతి నుంచి విమానాలు నడపలేదు. మొదటిసారి ఆదివారం నుంచి ప్రతిరోజూ హైదరాబాద్కు మూడు, బెంగళూరుకు రెండు చిన్నతరహా విమాన సేవలు ప్రారంభించింది. వీటిని ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ విమానయాన రంగంలో కనెక్టింగ్ ఫ్లైట్ విస్తరణ పెరగాలన్నారు. దీనివల్ల చిన్నచిన్న నగరాల నుంచి కూడా సులభంగా విదేశాలకు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఇప్పటికే దేశంలో 80 కనెక్టింగ్ ఫ్లైట్ సెంటర్లు ఉన్నాయని, ఈ సంవత్సరాంతంకల్లా అవి రెట్టింపు కావాలని ఆకాంక్షించారు. ఇండిగో సంస్థల చైర్మన్ ఆదిత్యఘోష్ మాట్లాడుతూ వేంకటేశ్వరుని సన్నిధిలో సేవలు ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.













