దేశంలో తొలిసారిగా ప్రయోగం
దేశంలో తొలిసారిగా పిండమార్పిడి (సరోగసీ) పద్ధతిలో ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని ఎస్వీ గోశాలలో మీడియా సమావేశంలో ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి సూచనతో టీటీడీ, ఎస్వీ పశువైద్య విశ్వవిద్యాలయం సంయుక్తంగా దేశవాళి గోజాతులను అభివృద్ధి చేయాలని నిరుడు ఒప్పందం కుదుర్చుకున్నదని చెప్పారు. మేలు రకమైన దేశ వాళి గోజాతిని అభివృద్ధి చేసే క్రమంలో ఎస్వీ గోశాలలోని మేలుజాతి ఆవుల నుంచి అండం సేకరించి ఎస్వీ పశువైద్య విశ్వ విద్యాలయం లోని ఐవీఎఫ్ ల్యాబ్లో కృత్రిమంగా పిండాలను అభివృద్ధి చేసి టీటీడీ గోశాలలోని ఆవుల్లో ప్రవేశపెట్టగా, ఒంగోలు ఆవుకు సాహివాల్ దూడ జన్మించిందని చెప్పారు. ఈ సాహివాల్ దూడకు పద్మావతి అని నామకరణం చేసినట్లు తెలిపారు.













