ఇప్పటికి టీడీపీ అదే లక్ష్యంతో : చంద్రబాబు
ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగ ఫలితమే దేశ స్వాతంత్య్రం అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదప్రజల అభ్యున్నతి కోసం పనిచేయాలనే ఆశయంతో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని, ఇప్పటికి తెలుగుదేశం పార్టీ అదే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. సమరయోధుల స్ఫూర్తితో దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. నదుల అనుసంధానం దేశ చిరకాల వాంఛ అని, అందుకోసం కృషి కొనసాగాలని ఆకాంక్షించారు. డిజిటల్ యుగంలోనూ అవినీతి ఆమోదయోగ్యం కాదని, అవినీతి ఉన్న చోట అభివృద్ధి ఉండదని స్పష్టం చేశారు.













