Nallapareddy: పార్టీలకతీతంగా మహిళలపై అసభ్య వ్యాఖ్యలు.. ఒక్కరిపై చర్యలు సరిపోతాయా?

ఇప్పటి రాజకీయాల ట్రెండ్ చూస్తే, అసభ్య పదజాలం వాడటం నిత్యసంఘటనగా మారిపోయింది. వేదిక ఎక్కడైనా, నాయకుల నోటి దురద మాత్రం ఆగడం లేదు. ఇటీవల తెలంగాణాలో ఓ నాయకుడు మహిళా నేతపై అనుచితంగా వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెప్పిన పదం “కంచం పొత్తు” అని మొదలై “మంచం పొత్తు” అని మారడం ద్వారా పరిస్థితి మరింత అసభ్యంగా మారింది. అది ఉద్దేశపూర్వకమా లేక మాట తప్పిందా అన్నదాని కంటే, మహిళల పట్ల ఆహార్యమైన పదజాలం వాడటం ఏమాత్రం కరెక్ట్ కాదు అన్నవాదన బలంగా వినిపిస్తోంది.
అలాగే, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూడా పరిస్థితి అంతే..కోవూరు (Kovuru) నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Reddy), టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prasanthi Reddy)పై అసభ్య వ్యాఖ్యలు చేశారని ఆరోపణలొచ్చాయి. దీనిపై ఆయనను అరెస్ట్ చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలు తప్పుగా ఉన్నాయనే అభిప్రాయం చాలామందికి ఉంది. అయితే ఇలాంటి పరిస్థితి తొలిసారి కాదు కదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
గతంలో విశాఖపట్నం (Visakhapatnam)కి చెందిన టీడీపీ నేత, అప్పట్లో మంత్రి అయిన ఆర్కే (RK) గారు వైసీపీ నాయకురాలు రోజా (R.K. Roja)పై చేసిన వ్యాఖ్యలు మాట ఏంటి? మరొక సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తనే “డైమండ్ రాణి” అంటూ రోజాను వ్యాఖ్యానించారు. అది పొగడ్తో, సెటైరా చెప్పలేం కానీ అర్థం మాత్రం అస్పష్టంగానే ఉంది. ఇదే నాయకుడు మరో వైసీపీ మహిళా మంత్రిపై మేకప్ గురించి వ్యాఖ్యలు చేయడం కూడా తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇటు వైసిపిలో కూడా నాయకులు ఏమాత్రం తగ్గకుండా కామెంట్స్ చేశారు.
ఈ ఉదాహరణలు చూస్తే, ఇది పార్టీలకు అతీతంగా ఉన్న సమస్య అనిపిస్తోంది. ఎవరి వంతు వచ్చినా, మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంలో వెనుకడుగు వేయడం లేదు. ఇప్పుడు వైసీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. అదే ధోరణి ఇతర పార్టీల నేతలపై ఎందుకు పాటించలేదన్న ప్రశ్న సహజంగా వస్తోంది. న్యాయం అందరికీ ఒకే విధంగా వర్తించాలనే అంచనాలతో పలువురు వాదిస్తున్నారు.
సామాజిక మాధ్యమాల వల్ల ఈ వ్యాఖ్యలు బయట పడుతున్నాయే కానీ, గతంలో ఇవే మాటలు ప్రైవేట్ లో జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఒక నాయకుడిని అరెస్టు చేస్తే, అదే సెక్షన్లను ఇతరులకు ఎందుకు వర్తింపజేయరు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో అసభ్య వ్యాఖ్యలపై కఠినంగా వ్యవహరిస్తే తప్ప, ఈ దురాచారం ఆగదు. తప్పు చేసినది ఎవరికైనా శిక్ష తప్పక ఉండాలని కోరుతున్నారు. అసలు ఏపీలో రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది..