చంద్రబాబుకు ఐటీ నజర్..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. ఐటీ టెన్షన్ పెరిగిపోతోంది. 118 కోట్ల రూపాయలకు సంబంధించిన ముడుపులు అందాయని, వాటిని అక్రమ ఆస్తులుగా ఎందుకు పరిగణించకూడదంటూ ఐటీ మరోసారి చంద్రబాబుకు నోటీసులిచ్చింది. ఈ వ్యవహారంపై గతంలోనే ఐటీశాఖ నోటీసులివ్వగా చంద్రబాబు దానికి బదులిచ్చారు. ఆ సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో ఐటీశాఖ అధికారులు… పక్కా ఆధారాలతో మరోసారి నోటీసిచ్చారు.
ఐటీ నోటీసులపై నాలుగు సార్లు సెంట్రల్ హైదరాబాద్ ఆఫీస్‌కు లేఖలు రాసిన చంద్రబాబు.. తనకు ఐటీ నోటీసులు జారీ చేసిన విధానాన్ని తప్పుబడుతున్నారు. జ్యూరిడిక్షనల్ అధికారి కాకుండా సెంట్రల్ ఆఫీస్ నుంచి.. ఐటీ నోటీస్ రావడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అభ్యంతరాలను తెలుపుతూ ఐటీ ఆఫీస్‌కు రాసి లేఖలను.. ఐటీ అధికారులు తోసిపుచ్చారు. మరోసారి ఇటీవల తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
కాగా, టీడీపీ హయాంలో అంటే 2016 నుంచి 2019 మధ్య కాలంలో ఇన్ ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్ట్‌ల ద్వారా రూ.118 కోట్ల ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఐటీ శాఖ విచారణ చేపట్టింది. బడా ఇన్ఫ్రా కంపెనీలకు అమరావతి ప్రాజెక్టుల కాంట్రాక్టులు అప్పజెప్పి.. వాటి ద్వారా సబ్ కాంట్రాక్టుల పేరుతో ప్రజాధనాన్ని తన ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు అభియోగాలు మోపింది. ఆ లెక్క ల్లేని ఆదాయంపైనే ఐటీ శాఖ చంద్రబాబును ప్రశ్నిస్తోంది.
చంద్రబాబుకు నగదు ముట్టినట్లు ఐటీ అధికారులు ఆధారాలతో చెబుతున్నారు.నగదు ఎవరెవరికి ఎలా డెలివరీ అయ్యిందో ఉదాహరణలతో వివరించింది కూడా. దీన్ని బ్లాక్ మనీగా ఎందుకు గుర్తించవద్దో చెప్పాలంటూ చంద్రబాబుకు మరో నోటీసు జారీ చేసింది. దీంతో చంద్రబాబు పాలనపై వైసీపీ నేతలు , మంత్రులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. బాబు పాలనలో అవినీతి జరిగిందనడానికి ఇంతకన్నా నిదర్శనమేముంటుందని సెటైర్లు వేస్తున్నారు.













