అమరావతిలో హైకోర్టు విధులు ప్రారంభం
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో హైకోర్టు కార్యకలాపాలు మొదలయ్యాయి. నేలపాడులో కొత్తగా నిర్మించిన జ్యూడీషియల్ కాంప్లెక్స్ భవనంలో హైకోర్టు సోమవారం నుంచి విధులు ప్రారంభించింది. తొలిరోజు కావడంతో న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు విధుల కంటే గంట ముందుగానే భవనానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌తోపాటు మిగిలిన న్యాయమూర్తులకు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, నేలపాడు గ్రామస్తులు సాదర స్వాగతం పలికి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ ప్రాంతానికి గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం హైకోర్టు నిర్మిత భూముల యజమానులను సీజే చేతుల మీదుగా సన్మానించారు.













