ఏపీలో అంతర్జాతీయ కంపెనీ భారీ పెట్టుబడులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో భారీ పెట్టుబడుల దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ జిల్లాలో మరో భారీ స్టీల్ ప్లాంట్ పెడతామంటూ ప్రముఖ స్విస్ కంపెనీ ఐఎంఆర్ ఏజీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ మేరకు ఆ కంపెనీ ప్రతినిధులు క్యాంప్ కార్యాలయంలో ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి వైఎస్ఆర్ జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు. 10 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఐఎంఆర్ కంపెనీ కార్యకలాపాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, కొలంబియా, ఇటలీ, ఉక్రెయిన్, భారత్ సహా పలు దేశాల్లో బొగ్గు, ఇనుప ఖనిజం, బంగారం లాంటి గనుల తవ్వకాలను చేపట్టడంతో పాటు విద్యుత్, ఉక్కు కర్మాగారాలను నడుతున్నామంటూ ఐఎంఆర్ కంపెనీ ప్రతినిధులు సీఎం జగన్కు వివరించారు.













