తక్షణమే ఆర్టికల్ 360 ప్రయోగించాలి : యనమల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టికల్ 360 ప్రయోగించిన ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించాలని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆధారరహిత ఆరోపణలు తానెన్నడూ చేయలేదేని, ఆ అలవాటు తానకెప్పుడూ లేదని అన్నారు. లొసుగులు బయటపడ్డాయన్న అక్కసుతోనే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన డిమాండ్లన్నీ హేతుబద్దమైనవేనని తేల్చి చెప్పారు. కాగ్‌లో ప్రస్తావించినవే తాను చెప్పానని ఆయన స్పష్టం చేశారు.
ప్రస్తుత ఆర్థిక మంత్రి కాగ్ నోటింగ్స్పై జవాబివ్వకుండా సంజాయిషీ చెప్పకుండా కావాలనే ఉద్దేశపూర్వకంగానే విస్మరించి, కప్పదాటేశారని విమర్శించారు. ప్రభుత్వం డిఫెన్స్‌లో పడిరదనేది రూఢీ అవుతోందన్నారు. సీఎఫ్ఎన్ఎస్ బైపాస్ చేయడం, ట్రెజరీ కోడ్ ఉల్లంఘన, ప్రభుత్వ బిల్లుల పేరుతో అనుచిత రాటిఫికేషన్లు, అక్రమ బిల్లులు పాస్ చేసుకోడానికి అవాంఛితంగా జీవో నెంబర్ 80 జారీ చేయడం వంటి లొసుగులన్నీ బయటపడేసరికి దిక్కుతోచకే ఎదురుదాడికి దిగారని ధ్వజమెత్తారు.













