పవన్ కల్యాణ్ సీఎం అయితే…!?
ఈ మధ్య ఏపీలో పవన్ కల్యాణ్ జపం నడుస్తోంది. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్సే ఇందుకు కారణం. తాము అధికారంలోకి వస్తే పవన్ కల్యాణ్ ను రాష్ట్రాధిపతిని చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు సోము వీర్రాజు ప్రకటించారు. దీంతో బీజేపీ, జనసేన శ్రేణుల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. జాతీయ పార్టీ అయిన బీజేపీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రాంతీయ పార్టీ అధినేత అయిన పవన్ కల్యాణ్ ను సీఎం చేయడమేంటి.. అని అందరూ చర్చించుకోవడం మొదలు పెట్టారు. అయితే ఇదంతా తిరుపతి ఉపఎన్నికల్లో జనసేన శ్రేణులను తమవైపుకు తిప్పుకోవడం కోసమేననే వాళ్లూ ఉన్నారు. కానీ ఆ పవన్ కల్యాణ్ సీఎం జపం మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంది.
సోము వీర్రాజు ప్రకటించిన తర్వాత బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కూడా ఇద మాట ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ అంటే బీజేపీ అధిష్టానానికి చాలా ఇష్టమని.. ఆయన్ను వదులుకోకూడదని తమతో పెద్దలు అన్నట్టు జీవీఎల్ చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వస్తే పవన్ నే సీఎం చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. బీజేపీ నేతల నుంచి పవనే సీఎం నినాదం రావడంతో జనసేన శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీకి జనసేన నేతలు సహకరించకపోవచ్చని.. అంతిమంగా టీడీపీకి లబ్ది చేకూరుతుందని అందరూ భావించారు. అయితే పవన్ సీఎం జపంతో సీన్ మారిపోయింది.
2023లో గెలిస్తే తమ అధినేత సీఎం అవుతాడనే ఫీలింగ్ జనసేన శ్రేణుల్లో కనిపిస్తోంది. పవన్ కు సీఎం అయ్యే అన్ని అర్హతలూ ఉన్నాయని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ కూడా అన్నారు. మరోవైపు బీజేపీ కంటే తమకే ఓటుబ్యాంకు ఎక్కువ అనే విషయాన్ని జనసేన శ్రేణులు ప్రస్తావిస్తున్నాయి. జాతీయ పార్టీ కావడంతో బీజేపీతో కలసి పనిచేస్తున్నామని చెప్తున్నాయి. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత బీజేపీ వైఖరిలో కూడా మార్పు వచ్చింది. అందుకే తిరుపతి ఉపఎన్నిక నేపథ్యంలో పవన్ సీఎం నినాదాన్ని లేవనెత్తింది. ఇది రెండు పార్టీలకు ఉభయతారకంగా మారింది.
మరోవైపు సీఎం పదవిపై తాజాగా పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ముఖ్యమంత్రి పీఠంపై రియాక్ట్ అయ్యారు. తనకు సీఎం పదవి వచ్చినా సంతోషమే.. రాకపోయినా సంతోషమనేన్నారు. అయితే సీఎం పదవి వస్తే మాత్రం అందరికంటే బాగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. కానీ తనకు సీఎం పదవిపై ఆశలేదన్నారు. ఎలాంటి పదవులూ ఆశించి రాజకీయాల్లోకి రాలేదన్నారు. తన తుది శ్వాస వరకూ దేశంకోసం, ప్రజలకోసం మాత్రమే పనిచేస్తానన్నారు. పదవి వచ్చినా రాకపోయినా ప్రజలెప్పుడూ తన గుండెల్లో ఉంటారన్నారు పవన్ కల్యాణ్.













