రాష్ట్రానికి అన్యాయం జరిగితే… ప్రశ్నించేది
రాష్ట్ర విభజన అనంతరం పార్లమెంటులో రాష్ట్రం కోసం టీడీపీ రాజీలేనటువంటి పోరాటం చేసిందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పనబాక లక్ష్మి అభ్యర్థి కావటం అందరికి గర్వంగా ఉంటుందన్నారు. ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. సీఎం హోదాలో చంద్రబాబు పీం మోదీని రాష్ట్రం కోసం ప్రశ్నించారన్నారు. ఏపీకి హోదా తీసుకువస్తానని జగన్ పాదయాత్రలో చెప్పి ఎంపీలను గెలుచుకున్నారని అన్నారు. 22 మంది ఎంపీలను తన కేసుల నుంచి బయటపడటానికి లాలూచి పడేలా చేశారని ఆరోపించారు.
విశాఖ ఉక్కు అమ్ముతుంటే మాట్లాడటం లేదని, మోదీని ప్రశ్నిస్తే జగన్ను జైల్లో పెడతారని భయపడి ఎంపీలు మాట్లాడటం లేదని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రశ్నించేది టీడీపీయేనని అన్నారు. కేంద్ర విద్యాసంస్థలు, ఇతర అభివృద్ధి పనులకోసం జగన్ కేంద్రానికి లేఖ రాయలేదని, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం ఇంటింటికీ లేఖలు రాస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. విశాఖలో భూములు అమ్ముతున్నారని, తిరుపతిలో వైసీపీ గెలిస్తే తిరుపతి భూములే కాదు ఏడుకోండలు అమ్మే ప్రమాదం ఉందని అన్నారు. టీడీపీకి ఓటు వేసి పనబాకను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.













