Amaravathi: కృష్ణా తీరాన ఐకానిక్ బ్రిడ్జి..నాలుగు డిజైన్లలో ఏది గెలుస్తుంది?

రాజధాని అమరావతి (Amaravati) ప్రాంతంలో కృష్ణా నదిపై (River Krishna) కొత్త ఐకానిక్ వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా నిలబెట్టేందుకు నాలుగు విభిన్నమైన డిజైన్లు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రజలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించాలని నిర్ణయించారు. అందుకే ఈ నాలుగు డిజైన్లలో ఏది ఉత్తమమో ప్రజల ఓటింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించడం విశేషం.
విజయవాడ (Vijayawada) నుంచి హైదరాబాద్ (Hyderabad) దారి తీసే జాతీయ రహదారికి అమరావతిని కలిపే రహదారిలో ఈ వంతెనను నిర్మించబోతున్నారు. ఇప్పటికే వెస్ట్ బైపాస్ వద్ద దాదాపు 3 కి.మీ. మేర నిర్మించిన బ్రిడ్జి అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే కొత్తగా రాయపూడి (Rayapudi) నుంచి ఎన్టీఆర్ జిల్లా (NTR District) లోని మూలపాడు (Mulapadu) వరకు 5 కి.మీ. పొడవులో ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించాలని ప్రణాళిక వేశారు. ఈ వంతెన పర్యాటక దృష్ట్యా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ప్రజల అభిప్రాయం కోసం ఆన్‌లైన్ ఓటింగ్ విధానం ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ (CRDA) అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఓట్ ఫర్ అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ (‘Vote for Amaravati Iconic Bridge Design’ ) అనే లింక్ ద్వారా పేరు, ఫోన్ నంబర్ నమోదు చేసి, నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేసే అవకాశం కల్పించారు. నాలుగు డిజైన్లు ప్రజల ముందుంచగా, వాటిలో ప్రతీదీ ఒక ప్రత్యేకతను కలిగి ఉండటం విశేషం.
మొదటి డిజైన్ కూచిపూడి (Kuchipudi) నృత్యంలోని హస్తముద్రల ఆకృతిని పోలి ఉంటుంది. రేడియేటింగ్ కేబుల్‌తో ఈ బ్రిడ్జి నిర్మాణం ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండో డిజైన్ ఎరుపు, తెలుపు రంగుల పైలాన్‌లతో రూపొందించబడింది. ఇది స్వస్తిక ముద్రను ప్రతిబింబిస్తూ అదృష్టం, సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుంది. దీన్ని కూడా కూచిపూడి శైలిలోనే వర్ణిస్తున్నారు.
మూడో ఆప్షన్ అమరావతి లోగోలోని ‘A’ ఆకారాన్ని పోలి ఉండేలా డిజైన్ చేశారు. ఇది అభయముద్రను సూచిస్తూ శాంతికి సంకేతంగా నిలుస్తుంది. నాలుగో డిజైన్ కపోత ముద్రలో రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది గౌరవం, ఆతిథ్యాన్ని సూచించే విధంగా ఉండటం వల్ల ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతుంది.
ఈ నాలుగు ప్రతిపాదనలు అన్ని ఆధునిక సాంకేతికతను ప్రతిబింబించడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సంస్కృతిని కూడా ప్రతిధ్వనింపజేస్తున్నాయి. ముఖ్యంగా కూచిపూడి నృత్య కళ్లతో అమరావతి వంతెనను ప్రతిపాదించడం ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపును ఇవ్వనుంది. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది డిజైన్‌ను నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.ఈ వంతెన కేవలం రవాణా కోసం మాత్రమే కాకుండా, రాజధాని ప్రాంతానికి ప్రతిష్టాత్మక గుర్తింపుగా నిలుస్తుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా ఎంపికయ్యే ఈ ఐకానిక్ బ్రిడ్జి, రాబోయే తరాలకూ ఒక గర్వకారణంగా నిలిచే అవకాశం ఉంది.