ఏపీలో మరొకసారి బదిలీలు షురూ.. దీని వెనుక కూటమి స్ట్రాటజీ ఏమిటో?
ఆంధ్రాలో అనూహ్యమైన విజయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కూటమి మరొకసారి బదిలీలకు నడుం బిగించింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలకు పైగా సమయం గడిచినప్పటికీ ఇంకా రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల జరిగిన బదిలీలలో కొన్ని మార్పులు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఎన్.తేజ్ భరత్ కు మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. పాడేరు ఐటీడీఏ పీడీ అభిషేక్‌ను చిత్తూరు జాయింట్ కలెక్టర్ గా నియమించగా..తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖర్ జైన్‌ను పాడేరు సబ్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. దీనితోపాటుగా పాడేరు ఐటిడిఏ పీవోగా ఆయనకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.
ఇక కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా.. అనంతపురం జిల్లా జేసీగా ఆదోని సబ్ కలెక్టర్ శివ నారాయణ నియామకాలు జరిగాయి. వారం రోజుల క్రితం జరిగిన బదిలీలలో డి.హరితను అనంతపురం జిల్లా జేసీగా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆమె స్థానంలో శర్మను నియమించారు. కొవ్వూరు, చిత్తూరు, పెనుకొండ సబ్ కలెక్టర్స్ ని కూడా బదిలీ చేశారు. శుక్రవారం నాడు 10 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగి 24 గంటలు కూడా పూర్తికాకముందే ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు జరగడం చర్చనీయాంశంగా మారింది.
గత ప్రభుత్వం హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన 16 మంది ఐపీఎస్ అధికారులకు ఇంకా ఎటువంటి పోస్టింగులు ఇవ్వకుండా హోల్డింగ్ లో పెట్టింది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఈ అంశంపై రాజకీయ వివాదం నెలకొని ఉంది. ఈ అధికారులు వైసీపీ హయాంలో ప్రజల కోసం కాకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం కోసం పనిచేశారు అనేది కూటమి ప్రభుత్వం ఆరోపణ. ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుతం ఈ 16 మంది ఎటువంటి పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆగని బదిలీల పర్వం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.













