తండ్రి పేరు మీద పార్క్.. మరొక వివాదంలో ఇరుక్కున్న ఐఏఎస్ అధికారి..శ్రీలక్ష్మి..
ఏపీ ఐఏఎస్ అధికారి వై శ్రీలక్ష్మి గురించి ప్రత్యేకంగా ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం.. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఘనుల శాఖ కార్యదర్శి హోదాలో ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ ఇచ్చారు అన్న అభియోగం ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ కేసు విషయంలో ఆమె కొన్నాళ్లు పాటు జైలు పాలు కూడా అయ్యారు. అయితే 2019లో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె దశ మారింది. అభియోగంలో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి కాస్త ఏకంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయ్యింది. అంతేకాదు పురపాలక, పట్టణ అభివృద్ధి శాఖలకు కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించింది. అయితే ఆ క్రమంలో రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో పలు వివాదాస్పద నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు ఆమెపై విమర్శలు వచ్చాయి. అప్పట్లో ఆ విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు మరొకసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విషయం వేరేగా ఉంది. ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన శ్రీలక్ష్మితో మాట్లాడడానికి చంద్రబాబు ఇష్టపడలేదట. అంతేకాదు ఆమె అందించిన పూల మొక్కను కూడా తీసుకోలేదని టాక్. ఇక ప్రస్తుత ఆంధ్రలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీలక్ష్మి కి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వలేదు. అంతేకాదు ఆమెను జిఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
తాజాగా ఆమె మరొక వివాదంలో చిక్కుకున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శ్రీ లక్ష్మీ తండ్రి ఎర్ర నాగేశ్వరరావు పేరుతో పార్కును నిర్మించారు. తండ్రి పేరుతో పార్కును ఎవరైనా నిర్మించుకోవచ్చు ఆ నిర్మాణానికి ప్రజాధనాన్ని వాడినప్పుడే ప్రాబ్లం వస్తుంది. ఇక ఇష్టం వచ్చినట్టు ఈ పార్క్ కోసం ప్రజాధనాన్ని వినియోగించినట్టు సరికొత్త వివాదంలో శ్రీలక్ష్మి చిక్కుకున్నారు. ఈ పార్కు కోసం మచిలీపట్నం నగరపాలక సంస్థ 18 లక్షల రూపాయలు ఖర్చు చేయగా ఏపీ గ్రీనరీ అండ్ బ్యూటీఫికేషన్ విభాగం ఏకంగా రెండు కోట్లను ఖర్చుపెట్టిందట. ఇలా మొత్తం మీద తండ్రి పేరుతో పార్కు నిర్మించడానికి శ్రీలక్ష్మి రెండు కోట్ల 18 లక్షల ప్రజాధనాన్ని ఉపయోగించారు. ఇక దీనిపై ప్రభుత్వం ఆమె విషయంలో ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.













