Bojjala Sudheer Reddy: రాయుడు హత్య తో నాకు సంబంధం లేదు.. తిరుమలలో ప్రమాణం చేసిన సుధీర్ రెడ్డి

రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపిన శ్రీకాళహస్తి (Srikalahasti) హత్యకేసు మరోసారి చర్చకు దారి తీస్తోంది. జనసేన పార్టీకి చెందిన మాజీ ఇంచార్జ్ వినుత (Vinutha) వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన శ్రీనివాసులు అలియాస్ రాయుడు (Srinivasulu alias Rayudu) హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి (Bojjala Sudheer Reddy) ఇప్పటివరకు మౌనంగా ఉన్నా, చివరకు గురువారం తిరుమల (Tirumala) లో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఆయన తాను దేవుడి సాక్షిగా మాట్లాడుతున్నానని, హత్య జరిగిన ఘటనలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఈ హత్యకు సంబంధించి రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో, సుధీర్ రెడ్డి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత కొద్దీ రోజులుగా వినుత వద్ద పనిచేస్తున్న రాయుడు, ఎమ్మెల్యేకు సంబంధించిన కొంత వ్యక్తిగత సమాచారాన్ని అందజేశాడన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కోపంతోనే హత్య జరిగిందని చెన్నై (Chennai) పోలీసులు వెల్లడించారు.
రాయుడు మృతి అనంతరం అతడి శవాన్ని చెన్నై ప్రాంతంలో కాలువలో పడేసినట్టు సీసీ కెమెరా ద్వారా గుర్తించిన పోలీసులు, విచారణ చేపట్టి షాకింగ్ విషయాలు వెల్లడించారు. జనసేన నేత వినుత, ఆమె భర్త చంద్రబాబు (Chandrababu) ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు చెన్నై పోలీసులు తెలిపారు. వారిని అరెస్ట్ చేసి విచారించగా, రాయుడు వారికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయాలు లీక్ చేశాడని , అందుకే హత్య చేశామని నిందితులు చెప్పినట్టు సమాచారం.
ఈ హత్యపై ఆరోపణలు ఎక్కువవడంతో జనసేన పార్టీ వెంటనే వినుతను పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. సోషల్ మీడియాలో కూడా జనసేనకు చెందిన కొంతమంది సుధీర్ రెడ్డి పై అనేక రకాలుగా విమర్శలు చేశారు. దీనికి స్పందనగా సుధీర్ రెడ్డి దేవుడు, కుటుంబం పేరుతో ప్రమాణం చేస్తూ తాను అప్రతిష్టకు గురవుతున్నానని, ఈ హత్యకు తనకు ఎంతమాత్రం సంబంధం లేదని తేల్చిచెప్పారు.ఇలా ఒక హత్య వెనుక రాజకీయ కుట్రలు, ద్రోహాలు, అనుమానాలు ఒకదాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ కేసు విచారణలో నిజాలు వెలుగు చూసే విధంగా చట్టపరమైన దర్యాప్తు ఎలా జరుగుతుందో చూడాలి.