న్యాయపరమైన చిక్కుల్లో ‘వ్యూహం’
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ …. రాజకీయ నేపథ్యంలో సినిమాలు తీయడంలో దిట్ట. గతంలో యాత్ర సినిమా తీసి సంచలనం సృష్టించారు వర్మ. అయితే అది పూర్తిగా టీడీపీని బ్లేమ్ చేస్తూ తీశారని.. అప్పట్లోనే టీడీపీ శ్రేణులు ఆరోపించారు. ఆ సినిమా ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించింది. తొలుత సినిమా పరంగా వైసీపీకి దగ్గరైన వర్మ.. తర్వాత నేరుగా టీడీపీ నేతలపై విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఆయన వ్యూహం సినిమాను రూపొందించారు.
అయితే….రాంగోపాల్‌వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా విడుదల నిలిచిపోయింది. ఈ సినిమాపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు.. సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఓటీటీ, ఆన్లైన్, ఇంటర్నెట్, థియేటర్ సహా మరే వేదికల్లోనూ దీనిని విడుదల చేయరాదని ఆదేశించింది.
దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. తెలుగుదేశం పార్టీని, తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేలా, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా సినిమా తీశారని పిటిషన్లో లోకేశ్ పేర్కొన్నారు. వ్యూహం సినిమాలో పిటిషనర్ కుటుంబ సభ్యులు, పార్టీకి సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, సినిమాను విడుదల చేస్తే పిటిషనర్ హక్కులకు తీవ్ర నష్టం జరుగుతుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిని విచారించిన సిటీ సివిల్ కోర్టు రెండో అడిషనల్ చీఫ్ జడ్జి సినిమా విడుదలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులైన రామదూత క్రియేషన్స్ సంస్థ, నిర్మాత దాసరి కిరణ్ తదితరులకు సమన్లు జారీచేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
మరోవైపు ‘వ్యూహం’ సినిమాకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్.. తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలుగుదేశం పార్టీని, పార్టీ అధినేత చంద్రబాబును అప్రతిష్ఠపాలు చేసేందుకు ఈ సినిమా తీశారని తెలిపారు. సినిమాటోగ్రఫీ చట్టం 1952, సెక్షన్-5 (బీ), 1991లో జారీ చేసిన రివైజ్డ్ గైడ్‌లైన్స్, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21, సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేశారని పేర్కొన్నారు.













