మానవ తప్పిదం వల్లే ఎల్జీ పాలిమర్స్ ఘటన
విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనకు మానవ తప్పిదమే కారణమని రిటైర్డ్ జడ్జి శేషశయనారెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జిటి)లో ఈ అంశంపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ శేషశయనారెడ్డితో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక సమర్పించింది. మానవ తప్పిదంతో పాటు, భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణమని ఈ కమిటీ తేల్చింది. ఈ ప్రమాదం కారణంగా 16 మంది చనిపోయారు. ఎంతోమంది అనారోగ్యం పాలయ్యారు. కాగా ఎల్జీ పాలిమర్స్ తరుపున లాయర్ సిద్ధార్థ లూధ్రా వాదనలు వినిపించారు. ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం ఎస్జీటీకి లేదని వాదించారు. ఈఎఎస్ శర్మ తరపు లాయర్ వాదిస్తూ 2001 నుంచి ఈ కంపెనీకి అనుమతులు లేకపోయినా నడిపిస్తోందని తెలిపారు. వాదనలు విన్న ఎస్జీటీ ధర్మాసనం నివేదికను పరిశీలించాక లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.













