Vijayawada: విజయవాడను వరదల నుంచి రక్షించేందుకు భారీ ప్రణాళిక.. బుడమేరు ఆధునీకరణ కోసం చర్యలు..
ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా అమరావతిని (Amaravathi) తీర్చిదిద్దడం చంద్రబాబుకు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో కేవలం అమరావతి పైనే కాకుండా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాలపై ఆయన తన దృష్టిని పెడుతున్నారు.ఇక విజయవాడ (Vijayawada) నగరం, ఏపీ రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న కీలకమైన నగరం. విజయవాడకు ఇటీవల భారీ వరదలు రావడంతో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. బుడమేరు వాగు (Budameru) పొంగడంతో నగరంలో విస్తారమైన నష్టం జరిగింది. ఈ వరద కారణంగా నగరం సగం మునిగి పోయింది. ఈ విపత్తును అధిగమించేందుకు విజయవాడకు నెల రోజుల పాటు సమయం పట్టింది. ఈ సందర్భంలో నగరాన్ని బుడమేరు వరదల నుండి రక్షించేందుకు ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది.
మున్సిపల్, జలవనరులశాఖ మంత్రులు పొంగూరు నారాయణ (Ponguru Narayana) , నిమ్మల రామానాయుడు (Nirmala RamaNaidu) మాట్లాడుతూ, బుడమేరు వరదల నుండి విజయవాడ నగరాన్ని రక్షించేందుకు భారీ ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. బుడమేరు వాగు ప్రాంతంలో ఆధునీకరణ పనులు చేపట్టడానికి రూ.3250 కోట్లు అవసరమని వారు అంచనా వేశారు. ఈ మొత్తంతో బుడమేరు వాగును వెడల్పు చేసి, దీని సామర్ధ్యాన్ని పెంచే పనులు చేపట్టడం, అలాగే సమీపంలో ఉన్న ఇళ్లను పునరావాసం చేయడం మొదలైన చర్యలు తీసుకోవడం అవసరమని వారు పేర్కొన్నారు.
3250 కోట్లు ఖర్చు పెట్టి విజయవాడ నగరాన్ని వరదల నుండి రక్షించేందుకు అడుగులు వేయనుంది కూటమి ప్రభుత్వం. ఇందులో 610 కోట్లు భూసేకరణ కోసం, మరో 610 కోట్లు పునరావాసం కోసం, 600 కోట్లు రిటైనింగ్ వాల్, టన్నెల్ ఆధునీకరణ కోసం ఖర్చు చేయబడతాయి. బుడమేరు కాలువ సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కుల నుండి 37,500 క్యూసెక్కుల వరకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించారు.
ఈ నెల 18న ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇవ్వాలని మంత్రులు ప్రకటించారు. గతంలో సంభవించిన బుడమేరు వరదల కారణంగా విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. ఈ వరదల్లో ప్రజలు ఎంతగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. ఎంత పోగొట్టుకున్నారో అందరికీ తెలుసు. అయితే ఇటువంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.













