అమరావతిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు హడ్కో సంసిద్ధత వ్యక్తం చేసింది. సుమారు పదెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో హడ్కో చైర్మన్, ఎండీ సంజయ్ కుల్శ్రేష్ట తదితర ప్రతినిధులతో సీఎం సమావేశమయ్యారు. పురపాలకశాఖ మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశం లో హడ్కో రాజధాని నిర్మాణానికి ఇటీవల రూ.11వేల కోట్ల రుణాలిచ్చేందుకు ముందుకు రావటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. రాజధాని అమరావతికిది శుభపరిణామమన్నారు. దీంతో పాటు అమరావతిలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేయటం ఆనందంగా ఉందన్నారు.













