HUDCO: హడ్కో తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం.. అమరావతి అభివృద్ధికి కీలక ముందడుగు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravathi) నిర్మాణం కొత్త దిశగా పురోగమిస్తోంది. రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు అవసరం కాగా, ప్రభుత్వం వాటిని సమీకరించేందుకు చర్యలు కొనసాగిస్తోంది. మొత్తం రూ.64 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా, ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్లు రుణంగా పొందిన సంగతి తెలిసిందే. తాజాగా మరొక కీలక ముందడుగు పడింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ (హడ్కో) (HUDCO) అమరావతి అభివృద్ధికి రూ.11 వేల కోట్లు రుణంగా అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ ఒప్పందం ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu Naidu) సమక్షంలో జరిగింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ (Minister Narayana) , మున్సిపల్ అధికారులు, హడ్కో ప్రతినిధుల మధ్య జరిగిన ఈ సమావేశంలో రుణ మంజూరుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేశారు. హడ్కో దేశవ్యాప్తంగా పట్టణాభివృద్ధికి రుణాలు అందజేసే సంస్థ. అమరావతి నిర్మాణాన్ని పరిగణనలోకి తీసుకుని, ఇప్పటికే హడ్కో పాలకవర్గం రుణ ప్రణాళికకు ఆమోదం తెలిపింది. జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో ఈ నిధుల మంజూరుకు అనుమతి లభించగా, తాజాగా అధికారిక ఒప్పందం కుదరింది. ఉండవల్లి లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో హడ్కో సీఎండీ సంజయ్ కుల్ శ్రేష్ఠ హాజరయ్యారు. అమరావతి నిర్మాణానికి కావాల్సిన రుణాన్ని విడతల వారీగా విడుదల చేయనున్నట్లు హడ్కో స్పష్టం చేసింది. ఈ నిధులు రాకతో రాజధాని పనులు మరింత వేగంగా ముందుకు సాగనున్నాయని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం రుణాన్ని వాయిదాలుగా తిరిగి చెల్లించేలా ఒప్పందాన్ని రూపొందించుకుంది.
అమరావతి నిర్మాణానికి నిధులు అందడం వల్ల పట్టణ అభివృద్ధి పనులు ఊపందుకోవచ్చు. ముఖ్యంగా కీలక ప్రాజెక్టులు వేగంగా పూర్తి అయ్యే అవకాశముంది. ప్రభుత్వం ముందుగా ప్రణాళికలను రూపొందించి, రుణాలను సమర్థవంతంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ రుణంతో రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశముంది. అమరావతి కలల నగరంగా రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుండగా, నిధుల లభ్యతతో పనులు వేగంగా పూర్తి చేయగలిగే అవకాశాలు పెరుగుతున్నాయి.













