వావ్.. లోకేశ్ లో ఇంత మార్పు ఎలా వచ్చింది?

నారా లోకేశ్.. పేరు వింటే మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుమారుడిగానే అందరూ గుర్తుకు తెచ్చుకుంటారు. ఆయన నీడలోనే ఆయన పెరిగారు. ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2019 ఎన్నికల వరకూ లోకేశ్ మంత్రిగా పనిచేశారు. అప్పుడు కూడా తండ్రిచాటు బిడ్డగానే గుర్తింపు పొందారు. కానీ ఎన్నికల తర్వాత మాత్రం లోకేశ్ లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. వృత్తిగతంగా, వ్యక్తిగతంగా ఎన్నో మార్పులతో లోకేశ్ వార్తల్లో నిలుస్తున్నారు.
నిన్నమొన్నటి వరకూ లోకేశ్ ను అందరూ చిన్నచూపే చూశారు. తనకు రాజకీయాలపై అవగాహన లేదన్నారు. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని లోకేశ్ చేతుల్లో పెడితో పార్టీ ఏమైపోతుందోనని అందరూ కంగారు పడ్డారు. అయితే ఇప్పుడు లోకేశ్ ఎంతో ఎదిగారు. తనను తాను మార్చుకుంటూ, నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారు. గతంలో ప్రెస్ మీట్ లలో ఎన్నోసార్లు తడబడ్డారు లోకేశ్. దీంతో చాలా సెటైర్లు లోకేశ్ పైన వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ప్రెస్ మీట్ లలో పంచులు పేలుతున్నాయి. అధికార పార్టీకి సవాళ్లు విసురుతూ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. కేడర్ కు భరోసా ఇస్తున్నారు.
2019 ఎన్నికల్లో ఓటమి టీడీపీకి పెద్ద గుణపాఠం. బహశా ఆ ఓటమి నుంచే లోకేశ్ నేర్చుకున్నారేమో.. తిరుపతి ఉప ఎన్నికను సవాల్ గా తీసుకుని కేడర్ ను ముందుకు నడిపించారు. 15 రోజులకు పైగా తిరుపతిలో మకాం వేసి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం తీసుకొచ్చారు. ర్యాలీలు, బహిరంగసభలు కాకుండా ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇదే సమయంలో వై.ఎస్.వివేకా హత్య కేసును తెరపైకి తెచ్చి అధికార వైసీపీని ఇరుకున పెట్టారు. లోకేశ్ ఉచ్చులో పడిన వైసీపీ సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. విజయమ్మ కూడా బహిరంగలేఖ రాయాల్సి వచ్చింది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన లోకేశ్.. అలిపిరి వద్ద ప్రమాణం చేసి.. జగన్ ను ప్రమాణం చేయాల్సిందిగా విసిరిన సవాల్ తీవ్ర చర్చనీయాంశమైంది.
టీడీపీ నేతలపై నమోదవుతున్న కేసుల పైన కూడా లోకేశ్ ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. తన పైన, తన తండ్రి చంద్రబాబుపైన, ఇతర టీడీపీ నేతల పైన పెడుతున్న కేసులకు ఏమాత్రం బెదిరేది లేదని.. జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని ట్విట్టర్ వేదికగా లోకేశ్ సవాళ్లు విసురుతున్నారు. జగన్ రెడ్డీ.. అంటూ నేరుగా సీఎంనే టార్గెట్ చేస్తూ విరుచుకు పడుతున్నారు. ట్విట్టర్లో లోకేశ్ కామెంట్లు చూసిన వాళ్లంతా ఇదేం తెగింపు.. ఇంతటి తెగింపు ఎలా వచ్చింది.. అంటూ సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు.
ప్రత్యర్థిపై విరుచుకు పడడంలోనే కాదు.. సొంత పార్టీ నేతలను ఆదుకోవడంలోనూ లోకేశ్ ముందుంటున్నారు. పార్టీ నేతలపై కేసులు పెట్టినప్పుడు నేరుగా వారి కుటుంబాలను కలిసి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. కరోనా బారిన పడిన కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. హోం ఐసోలేషన్ లో ఉంటున్న టీడీపీ నేతలకు వైద్యుల ద్వారా సలహాలు, మందులు అందిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఓ డాక్టర్ ను ప్రత్యేకంగా నియమించి కరోనాకు చికిత్స అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వల్ల మృతి చెందిన పార్టీ నేతల పిల్లలను ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. ఇలా లోకేశ్ లో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో తమకు భవిష్యత్ లీడర్ దొరికాడని టీడీపీ శ్రేణులు సంబరపడుతున్నాయి.